ఏలూరు ఘటన: పెరుగుతున్న బాధితులు

తాజా వార్తలు

Published : 07/12/2020 00:56 IST

ఏలూరు ఘటన: పెరుగుతున్న బాధితులు

ఏలూరు వన్‌టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నుంచి మొదలు ఇప్పటివరకు 286 మంది బాధితులు అనారోగ్యంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వారిలో 127 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మిగతావారు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురికి మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు చెప్పారు.

శనివారం రాత్రి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అక్కడి వైద్యులు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. చికిత్సలో భాగంగా ఇప్పటివరకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ కొవిడ్‌ నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాకుండా స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ మరో వంద మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

అంతుచిక్కని కారణాలు..

ప్రజల అస్వస్థతకు కారణాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. వైద్య పరీక్షలు నిర్వహించినా అన్నింటిలోనూ సాధారణ ఫలితాలే వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వైరల్‌, బ్యాక్టీరియా, కొవిడ్‌, సిటీ స్కాన్‌, నీటి నాణ్యత లాంటి అన్ని పరీక్షలు నిర్వహించినా వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అధికారులు వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. అస్వస్థులైన వారిని పరామర్శించేందుకు సోమవారం సీఎం జగన్‌ ఏలూరు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాణ నష్టం లేకుండా చూడాలి: గవర్నర్‌

వందల మంది అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. సమస్యకుగల కారణాలపై అధ్యయనం చేయాలని.. అవసరమైతే ఉన్నతస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని వైద్యశాఖను గవర్నర్‌ కోరారు.

ఇవీ చదవండి..
ఏలూరులో హఠాత్తుగా స్పృహ తప్పిన బాధితులు

అనారోగ్యానికి కారణాలు విశ్లేషించాలి: పవన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని