Corona: అధిక బరువు ప్రమాదం

తాజా వార్తలు

Published : 22/05/2021 01:27 IST

Corona: అధిక బరువు ప్రమాదం

హైదరాబాద్‌: కరోనా వేళ మన ఒంటి బరువే మనకు ముప్పుగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారికి, మిగతా వారితో పోలిస్తే వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది.  బీఎంఐ 23 కంటే ఎక్కువగా ఉన్న వాళ్లకు కరోనా సోకితే ప్రమాదం అంటున్నారు నిపుణులు. అలాంటి వారికి వైరస్‌ సోకితే ఆస్పత్రిలో అత్యవసర చికిత్స తీసుకునే అవసరం 5 శాతం ఎక్కువగానూ, ఇంటెన్సివ్‌కేర్‌లో చేరే అవకాశం 10 శాతం అధికంగా ఉంటుందని సర్వేలో తేలింది. ఆరోగ్యంగా ఉన్న వాళ్లతో పోలిస్తే వీళ్లకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగానే ఉంటుదనీ, శ్వాస నాళానికి రంధ్రం చేసి గొట్టం ద్వారా ఆక్సిజన్‌ అందించాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి శరీర ద్రవ్యరాశి సూచిక (బాడీ మాస్‌ ఇండెక్స్‌) బీఎంఐ ఉన్నదాని కంటే ఎక్కువగా ఉన్నవాళ్లకు కరోనా వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో స్థూలకాయులకు కరోనాతో పొంచి ఉన్న ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కిమ్స్‌ ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ చంద్రశేఖర్‌ పులి వివరించారు.

ఊబకాయం ప్రమాదమే

సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. యువకులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. లావుగా ఉన్న వాళ్లు డయాబెటీస్‌, న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్‌ వంటి వ్యాధులు సోకడం వల్ల కరోనా వైరస్‌ తీవ్రత అధికమవుతుంది. ఊబకాయుల్లో కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉండటం వల్ల ఇమ్యూన్‌ సిస్టంలో మార్పులు ఏర్పడతాయి. ఇలాంటి వాళ్లలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ చాలా తక్కువగా ఉంటున్నాయి. వెంటిలేటర్స్‌ మీద వైద్యం అందించాల్సి వస్తోంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులు కుచించుకుపోతున్నాయి. ఆ కారణంగా గాలి తీసుకోవడంలో సమస్యలు ఏర్పడి కరోనా పేషెంట్స్‌ చనిపోతున్నారు. 

సన్నగా ఉన్నవాళ్లు సేఫ్‌

బాగా సన్నగా ఉన్నవాళ్లు అంటే బీఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవాళ్లలో కరోనా సోకితే త్వరగా కోలుకుంటున్నారు. వీళ్లలో 1.44 శాతం మాత్రమే మరణం సంభవించే అవకాశం ఉంది. సాధారణ బీఎంఐ 20 నుంచి 24 మధ్యలో ఉన్నవాళ్లకు వైరస్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. క్లాస్‌ 2 ఒబేసీటీ బీఎంఐ 39 కన్నా ఎక్కువగా ఉన్న వాళ్లను కరోనా వైరస్‌ తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

గురక పెట్టే వాళ్లకు ఎక్కువ ముప్పు

ఊబకాయం ఉన్న వాళ్ల శరీరంలో హార్మోన్లు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. అవసరమైన దానికన్నా ఎక్కువగా హార్మోన్లు విడుదలవుతుంటాయి.  వీళ్లకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వల్ల డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్‌, కొవ్వు వల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. దాంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో నిద్రలో గురక పెట్టే వ్యాధి స్లీప్‌ యాప్నియా ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి కరోనా సోకితే చాలా ప్రమాదం.

ఊబకాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయులు ఆహారనియమాలు పాటించాలి. కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. సలాడ్స్‌ ఎక్కువగా తినాలి. ప్రొటీన్స్‌ ఆహారం తీసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాలు చెమట పట్టే వరకూ వ్యాయామం చేయాలి. ఊబకాయులకు కరోనా సోకితే బోర్లా పడుకోబెట్టి ఆక్సిజన్‌ అందించాలి. బోర్లా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులు విస్తరించి ఆక్సిజన్‌ ఎక్కువగా లోపలకు వెళుతుంది. ఇలా చేయడం వల్ల పేషెంట్‌ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని