Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 28/10/2021 13:18 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1.హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టు తీర్పు

హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. 

2.పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌ కొట్టివేత

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ పోలీసు కస్టడీ పిటిషన్‌ను విజయవాడ న్యాయస్థానం కొట్టేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల అరెస్టై బెయిల్‌పై విడుదలైన పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని గవర్నర్‌పేట పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగి ఉందని.. పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీలోకి ఇవ్వాలని కోరారు.

3. వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసనగా బండి సంజయ్‌ రైతు దీక్ష

వరి సాగుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర భాజపా ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్షకు దిగారు. తొలుత గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన సంజయ్‌.. అనంతరం కిసాన్‌ మోర్చా నేతలతో కలిసి దీక్షలో కూర్చొన్నారు.

4.ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చించనున్నారు.

కొవిడ్‌తో 30 రోజుల్లోగా మరణిస్తే పరిహారం!

5.ఆగని పెట్రో పరుగు.. హైదరాబాద్‌లో లీటర్‌ ధర ఎంతంటే..

దేశంలో ఇంధన ధరలు భగభగ మండుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీంతో బండి బయటకు తీయాలంటేనే సామాన్యుడి గుండె గుభేల్‌ అంటోంది. గురువారం కూడా చమురు సంస్థలు ఇంధన ధరలను మరోసారి పెంచాయి. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 31, 35 పైసలు చొప్పున పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.29కి చేరింది.

6.నీట్‌ ఫలితాల ప్రకటనకు సుప్రీం ఓకే

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నీట్‌ యూజీ ఫలితాలు ఇవ్వొద్దని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫలితాలను ప్రకటించాలని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను ఆదేశించింది.

7. తక్షణ వైద్య ఖర్చులను బీమా సంస్థలు పెట్టుకోలేవా?

ప్రమాదంలో గాయపడ్డవారి తక్షణ చికిత్సలకు అవసరమయ్యే ఖర్చులను బీమా సంస్థలు పెట్టుకోలేవా? అనే అంశాన్ని కేరళ హైకోర్టు పరిశీలన జరపనుంది. ఈ విషయమై విద్యార్థులు రాసిన లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే...ఇడుక్కి జిల్లా కుట్టికనంలోని మరియన్‌ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ సంస్థలో చదివే విద్యార్థి ఒకరు ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.

8. అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దు: భజ్జీ

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్‌ ఫైనల్లా చూడొద్దని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. కోహ్లీసేన సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిందే. మరోవైపు న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌ భారత జట్టుకు క్వార్టర్‌ ఫైనల్‌ వంటిదని అభిమానులు భావిస్తున్నారు.

ధోనీని మాస్టర్‌ మైండ్‌ అనేది ఇందుకే..!

9.పుష్పరాజ్, శ్రీవల్లి జోడీగా వస్తే.. ఈల వేయాల్సిందే..!

మునుపెన్నడూ లేనివిధంగా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) రఫ్‌లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’(Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక(Rashmika) నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ మాస్‌ ట్రీట్‌ బయటకు వచ్చింది.

10.అదే ఊగిసలాట.. మళ్లీ పెరిగిన కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, గత కొద్ది రోజులుగా కేసులు భారీగా తగ్గుతూ, పెరుగుతూ 20 వేల దిగువనే ఊగిసలాడుతున్నాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని