Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 16/06/2021 20:55 IST

Top Ten News @ 9 PM

1. ప్రభుత్వ జాప్యంతో ప్రజలకు ఇబ్బంది: హైకోర్టు

రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్‌ అథారిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఆదేశాలు అమలు కాకపోతే తదుపరి విచారణకు పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ హాజరై ... కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ అప్పీలేట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

హోంశాఖ గాఢనిద్రలో ఉందా?: హైకోర్టు

2. Ts News: సాగు రంగానిదే 17 శాతం వాటా

ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకే రైతు వేదికలు ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని ధర్మసాగర్‌, వేలూరు మండలాల్లో నిర్మించిన రైతు వేదికలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఇప్పటివరకు కేవలం 65 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలకే గోదాములున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో సాగు రంగానిదే 17 శాతం వాటా ఉందని వివరించారు.

3. Green fungus: కొత్తగా గ్రీన్‌ ఫంగస్‌

మధ్యప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దేశంలో ఇదే మొదటి గ్రీన్‌ ఫంగస్‌ కేసని సీనియర్‌ వైద్యుడొకరు వెల్లడించారు. ఈ కొత్త రకం ఫంగస్‌ ఆస్పెర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ అని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌కు (ఎస్‌ఏఐఎంఎస్‌) చెందిన డాక్టర్‌ రవి దోసి తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆయన వెల్లడించారు. ఆస్పర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.

4. Corona: చిన్నారుల చికిత్సకు ఆ మందులు వద్దు

కరోనా చికిత్సకు సూచించిన ఐవర్‌ మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఫేవిపిరవిర్‌, యాంటీ బయోటిక్స్‌ వంటివి చిన్నారుల చికిత్సకు సిఫార్సు చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల కొవిడ్‌ కేర్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్రమైన కరోనాతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సిఫార్సుల్లో తెలిపారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించాలన్న యోచనలో ఉన్న కేంద్రం దాని అనంతర చర్యల కోసం పలు సూచనలు చేసింది.

5. TAX: రూ.1.85లక్షల కోట్ల పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జూన్‌ 15 నాటికి రూ. 1.85లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 92,762కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది వసూళ్లు 100.4శాతం పెరిగినట్లు పేర్కొంది. ఇందులో కార్పొరేషన్‌ పన్ను వసూళ్లు రూ. 74,356 కోట్లు కాగా.. పర్సనల్‌ ఇన్‌కం ట్యాక్స్‌, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ రూ. 1.11లక్షల కోట్లు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు(రీఫండ్‌ చేయకముందు) రూ. 2.16లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.

6. CISCE: జులై 20నాటికి 12వ తరగతి ఫలితాలు!

సీఐఎస్‌సీఈ (ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌) 12వ తరగతి పరీక్ష ఫలితాలు జులై 20 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 11, 12వ తరగతుల విద్యార్థులకు అంతర్గత మదింపు ద్వారా మార్కులు కేటాయించి ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను కూడా కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. 12వ తరగతి ఫలితాల వెల్లడికి అనుసరిస్తున్న విధానంపై నివేదికను సీబీఎస్‌ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకు అందించనున్నట్టు సమాచారం.

7. జలుబుకు కారణమయ్యే వైరస్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌, ఔషధాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సాధారణ జలుబుకు కారణమైన వైరస్‌ (రైనోవైరస్‌)తో కొవిడ్‌-19 నుంచి రక్షణ కలుగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా జలుబు వచ్చినపుడు శరీరంలోని రోగనిరోధకతను ‘ఇంటర్‌ఫెరాన్‌ స్టిమ్యులేటెడ్‌ జీన్స్‌ (ఐఎస్‌జీ)’ అప్రమత్తం చేయడం ద్వారా కొవిడ్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. శరీరంపై దాడి చేసే వైరస్‌లను ఎదుర్కోవడంలో ఇంటర్‌ఫెరాన్లు కీలక రక్షణ వ్యవస్థగా నిలుస్తాయి.

8. ఆ తల్లి నిర్ణయం.. మోదీని మెప్పించింది

కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో చాలా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో వ్యహరించి వైరస్‌ను జయించారని కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన పూజా వర్మ తన భర్త గగన్‌ కౌశిక్‌, ఆరేళ్ల కుమారుడితో కలిసి సెక్టార్‌- 6 ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు.

9. ‘జోకర్’తో జాగ్రత్త: సీపీ అంజనీకుమార్‌

సైబర్‌ నేరగాళ్లు జోకర్‌ పేరుతో మాలిషియస్‌ మాల్‌ వేర్‌ను ప్రవేశపెట్టి  మోసాలకు పాల్పడే ప్రమాదముందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ముంబయిలో గత 3నెలలుగా ఈతరహా మోసాలు విపరీతంగా పెరిగాయని, వందల సంఖ్యలో యువత జోకర్‌ మాల్‌వేర్‌ వల్ల డబ్బులు కోల్పోయారని అంజనీకుమార్‌ తెలిపారు. జోకర్‌  మాలిషియస్‌ మాల్‌వేర్‌ను గూగుల్‌ సంస్థ బ్లాక్‌ చేసిందని, ప్లే స్టోర్‌ నుంచి పలు దఫాలుగా తొలగించినా.. సైబర్‌ నేరగాళ్లు వేర్వేరు పేర్లతో మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడుతున్నట్టు సీపీ వెల్లడించారు.

10. North Korea: ఆహార సంక్షోభంపై ‘కిమ్‌’ ఆందోళన!

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సమయంలో.. ఉత్తర కొరియాలో ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ అక్కడి పరిస్థితులపై ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా వీటిపై తొలిసారి పెదవి విప్పిన ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుంచి బయటపడేందుకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనుగొనాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం పొడిగిస్తున్నందున వాటికి సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు.

Face to Face: బైడెన్‌, పుతిన్‌ భేటీ!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని