
తాజా వార్తలు
స్కూల్ బస్సు, రెండు కార్లు, ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం
మద్యం మత్తులో రాంగ్రూట్లో నడిపిన క్లీనర్
కరెన్సీనగర్, న్యూస్‌టుడే: రాంగ్రూట్లో వచ్చిన లారీ డ్రైవర్.. రహదారిపై బీభత్సాన్ని సృష్టించాడు. మద్యం మత్తులో లారీ నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సుతో పాటు రెండు కార్లు, ఆటోలు, నాలుగు ద్విచక్రవాహనాలను ఎడాపెడా ఢీకొట్టాడు. వాహనచోదకులు గాయాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఇన్‌ఛార్జి సీఐ సత్యనారాయణ పోలీసుల కథనం ప్రకారం.. వీరులపాడు మండలం ఆలూరు గ్రామానికి చెందిన బురుగు మున్నయ్య.. ఎపి39ఎక్స్ 4455 నెంబరు గల లారీని నడుపుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతను గురువారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఆటోనగర్ వైపు నుంచి మహానాడు రోడ్డు మీదుగా గుణదల ఈఎస్ఐ రోడ్డులోకి వచ్చాడు. ఈఎస్ఐ జంక్షన్ వద్ద రింగ్‌రోడ్డు వైపు దారి లేకపోవడంతో రాంగ్రూట్లో పోనిచ్చాడు. అలా వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాలను అంచనా వేయలేక వాటి మీదకు దూసుకెళ్లాడు. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఎదురుగా రావడంతో దానిని ఢీకొట్టాడు. అలాగే రెండు కార్లను తప్పించబోయి వాటిమీదకు పోనిచ్చాడు. వాటి ముందుభాగాలు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో ప్రయాణికులతో వచ్చిన ఆటోను, నాలుగు ద్విచక్రవాహనాలపైకి కూడా వెళ్లాడు. లారీ వస్తున్న తీరును గమనించిన వాహనచోదకులు వాటిని వదిలేసి పారిపోయారు. కేకలు వేసినా డ్రెవర్ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కిషోర్(38), నాగలక్ష్మి(29), కంది శ్రీనివాసరావు(54), వెంకట రవితేజ(30) ఉన్నారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రి క్యాజువాల్టీలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌ను, లారీని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మున్నయ్య డ్రైవర్ కాదని, క్లీనర్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.