close

తాజా వార్తలు

Published : 29/10/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులు: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... ధరణి పోర్టల్‌ భారతదేశానికి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. ‘‘ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. సాగువిధానంలో అధునాతన మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశాం’’అని కేసీఆర్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాట ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావడం లేదు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ వైరల్‌ అవడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. దీంతో స్పందించిన రజనీ.. ఆ లేఖ తాను రాసింది కాదని చెప్పారు. అయితే రాజకీయ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌ ఇదే

రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఏ తరగతులకు ఎప్పటి నుంచి బోధన ప్రారంభమవుతుందో తెలుపుతూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే పాఠశాలలు తెరవనున్నారు. నవంబర్‌ 2 నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బోధన ప్రారంభమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి

అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న ఎన్నికల్లో మొత్తం ఇద్దరు భారత సంతతి వ్యక్తులు ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. డెమొక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ ప్రముఖం కాగా.. తాజాగా సునీల్‌ ఫ్రీమన్‌ అనే మరో అభ్యర్థి పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన ‘పార్టీ ఫర్‌ సోషలిజం అండ్‌ లిబరేషన్’ (పీఎస్‌ఎల్‌) తరపున పోటీ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా కమల సోషలిస్టు అయితే.. సునీల్‌ మరింత కరడుగట్టిన సోషలిస్టు అని అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది’ 

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమ పట్ల మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు వ్యవహరించిన తీరుపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి మండిపడ్డారు. గురువారం తమ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన తల్లితో కలిసి ఆమె మాట్లాడారు. పైడితల్లి అమ్మవారి పండగలో ఏటా పాల్గొనటం తమ కుటుంబ సంప్రదాయమన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా సిరిమాను దర్శనానికి తన తల్లితో కలిసి వచ్చానని ఊర్మిళ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. దుబ్బాకలో భారీ మెజార్టీ ఖాయం: బండి సంజయ్‌

దుబ్బాక నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు మొత్తం భాజపానే గెలుస్తుందని చెప్తున్నాయన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. రోజు రోజుకూ దుబ్బాకలో భాజపాకి ఆదరణ పెరుగుతోందన్నారు. దుబ్బాకలో భారీ మోజార్టీతో భాజపా గెలవడం ఖాయమని సంజయ్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కోల్‌కతాకు రన్‌రేట్‌ గండం..!

ఈ సీజన్‌లో ఎవరికీ అర్థం కాని జట్టు ఏదైనా ఉందంటే అది కోల్‌కతానే. అస్థిరత్వానికి మారుపేరులా మారిందా జట్టు. ఓటములకు కారణాలేంటో తెలియక యాజమాన్యమే అయోమయంలో పడిపోయింది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఈ మాజీ ఛాంపియన్‌కు మొదటి నుంచీ అనూహ్య ఫలితాలే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఆరు మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పంజాబ్‌తో సమానంగా ఉంది. రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కంటే దిగువన ఉండిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఏపీలోనూ అదే పరిస్థితి రానుంది: రఘురామ

పొరుగు రాష్ట్రం నుంచి నాణ్యమైన మద్యాన్ని తెచ్చుకునే ప్రజలను ఏపీ ప్రభుత్వం కేసుల పేరుతో వేధించడం సరికాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. దొంగ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని.. అనధికార బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల శ్రమను కొంతమంది మద్యం వ్యాపారులు దోచుకుంటున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వైరస్‌ వల.. పసిడి గిరాకీ వెలవెల

ఓ వైపు కొవిడ్‌ విజృంభణ, ఆర్థిక వ్యవస్థ మందగమనం.. మరోవైపు రెక్కలొచ్చిన ధరలు.. ఫలితంగా దేశంలో బంగారం గిరాకీ అంతకంతకూ పడిపోయింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 30శాతం తగ్గి 86.6 టన్నులకు పరిమితమైంది. 2019 ఇదే త్రైమాసికంలో పుత్తడి డిమాండ్‌ 123.9 టన్నులుగా ఉంది. నగల గిరాకీ కూడా 48శాతం తగ్గి 52.8టన్నులకు పడిపోయింది. ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.