
తాజా వార్తలు
వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం శనివారం మరోసారి భేటీ కానుంది. అయితే రైతుల ప్రతిపాదనలకు ఒప్పుకుంటూ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతుల ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కేంద్ర మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన మోదీ.. రైతు సంఘాలు లేవనెత్తిన అంశాలు, చట్టాల రద్దు డిమాండ్లపై వ్యవహరించాల్సిన వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు.
అయితే నేటి సమావేశంలో చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం అన్నదాతలకు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కనీస మద్దతు ధరపై రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రయివేటు మండీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు చట్టాలపై రైతులకున్న సందేహాలు ఇవాల్టితో తీరుతాయని, సమావేశం అనంతరం వారు కచ్చితంగా ఆందోళన విరమిస్తారని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి తెలిపారు.
విజ్ఞాన్‌భవన్‌కు రైతులు
కేంద్రంతో చర్చల నిమిత్తం రైతు సంఘాల ప్రతినిధులు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు. నూతన చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని, చట్టాల్లో సవరణలు చేస్తామంటే తాము ఒప్పుకోమని రైతులు కరాఖండీగా చెబుతున్నారు. మరి ఈ చర్చలతోనైనా ప్రతిష్టంభన తొలుగుతుందో లేదో చూడాలి..!
ఇవీ చదవండి..
ముచ్చటగా మూడోసారి.. ముగింపు లభించేనా?