close

తాజా వార్తలు

పోలింగ్‌ ముగిసింది.. ఫలితాలపైనే ఉత్కంఠ!

ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు

బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సాయంత్రం 5గంటల సమయానికి మొత్తం 60శాతం పోలింగ్‌ నమోదైంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫలితాలు డిసెంబర్‌ 9న వెలువడనున్నాయి. ప్రభుత్వ మనుగడకే కీలకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బెంగళూరు నగర పరిధిలోని కేఆర్‌ పురం, యశ్వంత్‌పూర్‌, మహాలక్ష్మీ లేఅవుట్‌, శివాజీనగర్‌ నియోజకవర్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను శిక్షించండి అంటూ కేఆర్‌ పురంలో పలువురు ప్రజలు బ్యానర్లు ప్రదర్శించడం గమనార్హం. చౌడెనిహళ్లిని కేఆర్‌ పేట్‌ తాలుకాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్దకు పెళ్లిపీటల నుంచి వచ్చిన ఓ వరుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 

కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌, భాజపాలు 15 స్థానాల్లో, జేడీఎస్‌ 12, బీఎస్‌పీ 2, ఎన్‌సీపీ ఒక్క స్థానం నుంచి తమ అభ్యర్థులను బరిలో దించాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వారికి కల్పించిన విషయం తెలిసిందే. గత విధానసభ ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఉప పోరులో ఒంటరిగానే బరిలో దిగాయి. అనర్హతకు గురైనవారు భాజపా నుంచి పోటీ చేస్తుండగా, వీరందరికీ మంత్రి పదవులిస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప గతంలో ప్రకటించారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మళ్లీ జట్టుకడతాయన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏ పార్టీ బలం ఎంత?

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం భాజపాకు 105 (ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి), కాంగ్రెస్‌ 66, జేడీఎస్‌ 34, బీఎస్పీ 1, నామినేటెడ్‌ ఎమ్మెల్యే  ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113. దీంతో యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును ఈ ఎన్నికలే తేల్చనున్నాయి.ప్రభుత్వ మనుగడకు ఈ ఉప ఎన్నికలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం భాజపాకు 105 సీట్లున్నాయి. మరో  ఎనిమిది సీట్లు వస్తేనే ప్రభుత్వం కొనసాగే అవకాశాలుంటాయి. దీంతో ఈ నెల 9న వెల్లడయ్యే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

అన్ని స్థానాల్లోనూ గెలుపు మాదే: సవాడి
ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలూ భాజపానే గెలుచుకుంటుందని డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడి విశ్వాసం వ్యక్తంచేశారు. బీఎస్‌ యడియూరప్పే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూల విధానాలను అనుసరిస్తోందన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.