
తాజా వార్తలు
గహ్లోత్‌కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు
కాంగ్రెస్ అర్ధరాత్రి ప్రకటన
జైపుర్: ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడ్డ విషయం తెలిసిందే. 30 మంది ఎమ్మెల్యేల మద్దతు తనవైపే ఉందని పైలట్ ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి గహ్లోత్‌కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. ఈ మేరకు వారంతా ఓ లేఖపై సంతకం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి అవినాశ్ పాండే వెల్లడించారు. మరికొంత మంది కూడా ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారంతా సోమవారం ఉదయానికి లేఖపై సంతకం చేస్తారన్నారు. ఎమ్మెల్యేలంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శనంలో.. గహ్లోత్ ప్రభుత్వంలో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో దిల్లీ నుంచి రంగంలోకి దిగిన రణ్‌దీప్ సూర్జేవాలా, అజయ్ మకెన్లతో కలిసి అవినాశ్ పాండే అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
నేడు సీఎల్పీ సమావేశానికి గహ్లోత్ పిలుపునిచ్చిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు అవినాశ్ పాండే తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత, ప్రత్యేక కారణాలు ఉంటే ఎమ్మెల్యేలు ముందే తెలియజేయాలని సూచించారు. నేటి సీఎల్పీ సమావేశానికి హాజరయ్యేది లేదని సచిన్ పైలట్‌కి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
దిల్లీలో ఉన్న అవినాశ్ పాండే.. నిన్నటి పరిణామాల నేపథ్యంలో అర్ధరాత్రి జైపుర్‌కు చేరుకున్నారు. దిల్లీలో సచిన్ పైలట్‌ని కలిశారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆయన దిల్లీలో ఉన్నారా? నాకు ఈ విషయం తెలియదు’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు సచిన్ నేడు భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్పీ సమావేశానికి హాజరుకాబోనని ప్రకటించిన ఆయన.. నేడు భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో భేటీ కానున్నట్లు చర్చ నడుస్తోంది. ఆ తర్వాత ఆయన భవిష్యత్తలు కార్యాచరణ ఏంటో ప్రకటిస్తారని తెలుస్తోంది.
మరోవైపు ఈ విషయంలో భాజపా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. గహ్లోత్, సచిన్ పైలట్ బలాబలాలేంటో బయటకు వచ్చే వరకు మౌనంగా ఉండేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. పైలట్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన తర్వాతే.. తాము రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పైలట్ ముఖ్యమంత్రి పదవి కోరుతున్నట్లు సమాచారం. దీనికి భాజపా అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..