
తాజా వార్తలు
అదరగొట్టిన శ్రేయస్: ముంబయి లక్ష్యం 157
ఇంటర్నెట్‌డెస్క్: శ్రేయస్ అయ్యర్ (65*, 50 బంతుల్లో, 6×4, 2×6), పంత్ (56; 38 బంతుల్లో, 4×4, 2×6) అర్ధశతకాలతో అదరగొట్టిన వేళ ఫైనల్లో ముంబయికి దిల్లీ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దిల్లీకి పేలవ ఆరంభం లభించింది. బౌల్ట్ ధాటికి 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్, శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బౌండరీల మోత మోగించింది. ఈ క్రమంలో పంత్ 35 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి పంత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో శ్రేయస్-పంత్ 96 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం వచ్చిన హెట్మైయర్ (5) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతడు 41 బంతుల్లో హఫ్‌సెంచరీ అందుకున్నాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (9)తో కలిసి శ్రేయస్ బ్యాట్ ఝుళిపించడంతో దిల్లీ 150 పరుగులు దాటింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్ మూడు, కౌల్టర్‌నైల్ రెండు, జయంత్ ఒక వికెట్ తీశారు.