
తాజా వార్తలు
త్వరలో అందుబాటులోకి వ్యాక్సిన్: ఎయిమ్స్ డైరక్టర్
దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పరీక్షలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో డిసెంబరు నెలాఖర్లో లేక జనవరి ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఓ మీడియా సంస్థతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పూర్తి అనుమతులు పొందిన తర్వాత అధికారులు ప్రజలకు దాన్ని అందించే ప్రక్రియను ప్రారంభిస్తారన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన పనులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నాయని తెలిపారు. వాటిని భద్రపరచేందుకు తగిన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్‌ను ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కసరత్తు చేస్తున్నాయన్నారు. చెన్సైలో ఒక వాలంటీర్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అనారోగ్యానికి గురయ్యానని చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘పెద్ద సంఖ్యలో ప్రయోగాలు చేస్తున్నపుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుతం ఆ వాలంటీర్‌కు కలిగిన పరిస్థితికి వేరే అనారోగ్యాలు కారణం కావచ్చు. వ్యాక్సిన్ వల్ల అయితే కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ రక్షణ గురించి ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సురక్షితం అని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. సుమారు 70,000-80,000 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ను వేసినా, ఇప్పటి వరకూ ఎవరికీ తీవ్ర దుష్ఫ్రభావాలు కలగలేదన్నారు. వ్యాక్సిన్ ఏదైనా సరే దీర్ఝకాలం తీసుకుంటేనే సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్కేసులు తగ్గుముఖం పడుతున్నాయని డా. రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ఈ విధంగానే మరో మూడు నెలలు కొనసాగితే మనం పెద్ద మార్పును గమనించొచ్చన్నారు.