close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. కరోనాపై నిర్లక్ష్యం తగదు: చంద్రబాబు

కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని చెప్పారు. కరోనా గురించి అనేకమంది నిపుణులతో చర్చించానని, కరోనా పాజిటివ్‌ వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వ్యాధి వస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కొంతవరకు కరోనా నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజూ వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో 97కి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 97కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా.. 14 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

* వైరస్‌ పాతదే..కొత్త రూపంలో వణికిస్తోంది!

3. మార్చి... ఇటలీకి మర్చిపోలేని నెల!

అయ్యయ్యో.. ఇటలీ! తల్చుకుంటేనే కన్నీరు ఉబికివస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశానికి శాపంగా మారింది. మార్చిని ఎప్పటికీ మర్చిపోలేని నెలగా మార్చేసింది. పదులా.. వందలా.. నేటికి 11,591 మంది కొవిడ్‌-19తో చనిపోయారు. మరణించిన వారి స్మారకార్థం మంగళవారం ఇటలీ జాతీయ పతాకాలను అవనతం చేసింది. మౌనం పాటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశంలో ఇలాంటి మరణమృదంగం మోగడం ఇదే తొలిసారి. ‘ఈ వైరస్‌ ఒక గాయం. అది దేశమంతా గాయపర్చింది’ అని రోమ్‌ మేయర్‌ వర్జీనియా రాగి మౌనం పాటించిన తర్వాత అన్నారు. ‘మనందరం కలసికట్టుగా దీనిని ఎదుర్కొందాం’ అని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: రేవంత్‌

కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదని ఎత్తిచూపడం లేదన్నారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో 45 కరోనా మరణాలు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటివరకు 200 దేశాలకు విస్తరించిన కొవిడ్‌ 19.. భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1418 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  అలాగే, మృతుల సంఖ్య 45కి చేరినట్టు తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 167 కేసులు నమోదవ్వగా.. 13 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని 123 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.   పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా సహాయ కేంద్రానికి సమాచారం..వ్యక్తి హత్య!

6. జియో: 100 నిమిషాలు 100 SMSలు ఉచితం

వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మహమ్మారి కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 8 రోజుల్లోనే ఆర్థికలోటు వచ్చిందా: కోమటిరెడ్డి

 రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు కాంగ్రెస్‌ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే ధనిక రాష్ట్రం అని చెబుతూనే నేడు ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారని.. కేవలం 8 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ నటుడ్ని పెళ్లి చేసుకోబోతున్నా: గుత్తా జ్వాల

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే వీరి బంధంపై గుత్తా తాజాగా స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ‘అవును.. మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం’ అని తేల్చి చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* లైవ్‌లో కన్నీరు పెట్టుకున్న రష్మి

9. ఈఎంఐ వాయిదాలకు బ్యాంకుల ఆమోదం

భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాల గురించి తమ శాఖలకు తెలియజేశాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఆర్థికంగా కాస్త వెలుసుబాటు కల్పించేందుకు కాలపరిమితితో కూడిన రుణ వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్‌బీఐ సూచించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వలస కూలీలతో గ్రామాలకు వైరస్‌!:కేంద్రం

 లాక్‌డౌన్‌ సమయంలో నగరాల నుంచి వలస కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోతున్నారు. ముఖ్యంగా దిల్లీ నుంచి సమీప రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు కాలినడక తరలివెళ్తున్న ఘటనలు దేశాన్నే కలచివేశాయి. అయితే ఇలా వెళ్తున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరి ద్వారా కరోనా వైరస్‌ గ్రామాలకు సోకే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రెయిన్‌కోట్లు.. హెల్మెట్లే రక్షణ కవచాలు.. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.