close

తాజా వార్తలు

Updated : 03/12/2020 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తమిళ ప్రజల కోసం ప్రాణమైనా ఇస్తా: రజనీ

చెన్నై: తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని, రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సంతోషపడతానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అధికారికంగా ప్రకటించిన అనంతరం తలైవా తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే ఉన్నారని రజనీ ఈ సందర్భంగా తెలిపారు. వైద్యులు వద్దంటున్నా.. ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ అరంగేట్రం కోసం రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా కొవిడ్‌ వల్ల అది సాధ్యపడలేదన్నారు. తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీ పిలుపునిచ్చారు. 

‘ఇచ్చిన హామీలపై ఎప్పుడూ వెనక్కివెళ్లను. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదు. ఇందుకోసం ప్రజలు నా వెంట ఉంటే.. మనమంతా కలిసి మార్పును తీసుకొద్దాం’ అని రజనీ అన్నారు. ప్రజల ఆదరణతో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని తలైవా ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో అద్భుతాలే..!

రాబోయే ఎన్నికల్లో అద్భుతాలు.. ఆశ్చర్యాలు చోటుచేసుకుంటాయని రజనీ పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రాణాలు పోయినా సంతోషమేనని తెలిపారు. చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌లో తన నివాసం వద్ద రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీని ప్రారంభించి 234 స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో చెప్పానని గుర్తుచేసుకున్నారు. మార్చిలో లీలా ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో భాగంగా ప్రజల్లో చైతన్యం రావాలని, వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ ప్రారంభించాలని నిర్ణయించి తదనుగుణంగా తమిళనాడు వ్యాప్తంగా పర్యటించాలనుకున్నట్టు తెలిపారు. అయితే, కొవిడ్ కారణంగా పర్యటన వీలు కాలేదని చెప్పారు. మూత్రపిండాల మార్పు కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువైందని, కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా తన ఆరోగ్యానికి అపాయకర పరిస్థితి ఎదురవుతుందని వైద్యులు చెప్పారంటూ రజనీ తెలిపారు. అందుకే కొంత ఆలోచించానన్నారు.

అందువల్లే ప్రాణాపాయం నుంచి బయటపడ్డా..

అయితే, అనారోగ్యంతో సింగపూర్‌లో చికిత్స చేసుకున్న సందర్భంలో ప్రజల ప్రార్థనల వల్లే తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాని రజనీ తెలిపారు. ప్రస్తుతం తమిళ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు.  ఇచ్చిన వాగ్ధానాన్ని ఎప్పుడూ తప్పబోనన్న ఆయన.. రాష్ట్రంలో రాజకీయ మార్పు అత్యావశ్యమని, భవిష్యత్తు కోసం రాజకీయ మార్పు జరిగి తీరాలన్నారు. ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదన్నారు. ‘మార్చాలి, అన్నింటినీ మార్చాలి. అందుకు నేను సాధనం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ మార్పునకు ప్రజలంతా తోడుగా నిలవాలని కోరారు. 

ఇద్దరు బాధ్యుల నియామకం
తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నాటి నుంచి తనకు వెన్నుదన్నుగా ఉన్న తమిళరువి మణియన్‌ను పార్టీ పర్యవేక్షకుడిగా నియమిస్తున్నట్టు రజనీ తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అర్జునన్‌మూర్తి లభించడం తన భాగ్యమని, ఆయన్ను పార్టీ ప్రధాన సమన్వయ కర్తగా నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. 

రాజకీయ అరంగేట్రంపై సుదీర్ఘ సందిగ్ధతకు తెరదించుతూ రజనీ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయతీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం’ అని రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు. రజనీ రాజకీయ ప్రకటనపై ఆయన కుమార్తె సౌందర్య సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం.. ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదు’ అంటూ తండ్రి ఫొటోను షేర్‌ చేశారు. 

 

 

ఇదీ చదవండి: 

జవనరిలో రజనీ రాజకీయ అరంగేట్రంTags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన