close

తాజా వార్తలు

Updated : 28/01/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ అందానికి ఏమైంది?

పద్దెనిమిదేళ్ల రమ్య డిగ్రీ చదువుతోంది. ఉదయమే కాలేజీకి బస్సులో ప్రయాణం. దుమ్ము, ధూళితో ప్రతిరోజూ ఇబ్బందే. ఫలితంగా ముఖం మీద మొటిమలు, పొక్కులు.

ఇరవై అయిదేళ్ల కావ్య ఓ ప్రముఖ సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌. ఎండా, వాన, దుమ్ము, ధూళి అనక ఉద్యోగరీత్యా రోజంతా బయట తిరగాల్సిన పరిస్థితి. దాంతో చర్మం నిర్జీవంగా మారి, అప్పుడే ముడతలు కనిపిస్తున్నాయి.

వీరిద్దరే కాదు... చాలామంది అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు కాలుష్య రక్కసి తన ప్రతాపాన్ని చూపెడుతుంది. కాలుష్యం వల్ల చర్మానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. ముఖం మీద నల్ల, తెల్ల మచ్చలు, ముడతలు పడటం, చర్మం గరుకుగా మారడం, యాక్నే, ఎగ్జిమా, వృద్ధాప్య ఛాయలు... లాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

కాలుష్యాలెన్నో...

వాహనాలు, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే పొగ, బూడిద, మొక్కలకు వాడే ఎరువులు, సిగరెట్‌ పొగ... వీటన్నింటి వల్లా వాతావరణం కలుషితమవుతుంది. వీటివల్ల యాక్నే, అలర్జీలు, ఎగ్జిమాలు ఎక్కువవుతున్నాయి. చర్మ సంబంధ సమస్యలే కాకుండా చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. జీవన విధానంలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్ఛు

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

బయటకు వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకుంటే దుమ్మూధూళి నుంచి రక్షించుకోవచ్ఛు కళ్లజోడు, టోపీ పెట్టుకోవాలి. తగినన్ని మంచినీళ్లు తాగాలి. ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజూ మేకప్‌ వేసుకునేవాళ్లు ఇంటికి రాగానే దాన్ని తొలగించి, క్లెన్సింగ్‌ చేసుకోవాలి. విటమిన్‌ ఎ, సి, డి, బి3లను ఆహారంలో తీసుకోవాలి లేదా వైద్యుల సూచనల మేరకు మందుల రూపంలోనూ వాడాలి. నిపుణులను సంప్రదించి... చర్మ తత్వాన్ని బట్టి పైపూతగా క్రీమ్‌లు వాడాలి.

పొడిచర్మం

కాలుష్యం వల్ల వీరి చర్మం మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా దురద, ముడతలు, గీతలు వస్తాయి. వృద్ధాప్య ఛాయలు ముందుగానే కనిపిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే జెంటిల్‌ మాయిశ్చరైజింగ్‌ ఫేస్‌వాష్‌ వాడాలి. విటమిన్‌-సి లేదా క్రీమ్‌బేస్డ్‌ యాంటీఆక్సిడెంట్లు, రోజూ సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఉపయోగించాలి. మల్టీ విటమిన్‌ మాస్క్‌ వారానికి మూడుసార్లు వేసుకోవాలి. దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది.

ఎలాంటి ఆహారం

రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తినాలి. గుమ్మడి గింజలు తీసుకోవాలి. వీటిల్లోని జింక్‌ కణాలను ఉత్తేజపరుస్తుంది. విటమిన్‌-సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు, విటమిన్‌-ఇ, బి లు ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. తేనె, పసుపు, పెరుగును పైపూతగా, ఆహారంగానూ తీసుకోవచ్ఛు ఇవి చర్మానికి పోషణనిచ్చి మెరిపిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే గ్రీన్‌ టీ, బాదం, బెర్రీలు, చిలగడదుంపలు, క్యారెట్లు, టమాటాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌లా పనిచేసే ఆలివ్‌ ఆయిల్‌ను సహజ సిద్ధమైన ఫేస్‌ మాస్క్‌ల తయారీలో కలపొచ్ఛు ఇది చర్మానికి మెరుపునిస్తుంది.

జిడ్డుచర్మం

జిడ్డు తక్కువగా ఉండే ఫేస్‌వాష్‌ను ఉపయోగించాలి. ఆల్కహాల్‌ లేని టోనర్‌, మ్యాటీ మాయిశ్చరైజర్‌, జెల్‌ బేస్డ్‌ సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. గ్లైకాలిక్‌ యాసిడ్‌ ఉన్న నైట్‌ క్రీమ్‌, విటమిన్‌-సి ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు వాడాలి. వారానికి మూడుసార్లు స్క్రబ్‌ చేసుకోవాలి.

ఏజింగ్‌ స్కిన్‌

నలభై, ఆపై వయసున్న వాళ్లు హైడ్రేటింగ్‌ ఫేస్‌వాష్‌ వాడాలి. యాంటీ ఏజింగ్‌ ఫేస్‌ సీరం, క్రీమ్‌లను ఉపయోగించాలి. రోజుకు రెండుసార్లు అండర్‌ ఐ క్రీమ్‌ రాయాలి.

మసాలాలు, నూనె అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి. మేకప్‌ వేసుకుంటే ఇంటికి రాగానే ఐస్‌క్యూబ్‌తో శుభ్రపరుచుకోవాలి. టవల్‌లో ఐస్‌క్యూబ్‌ను చుట్టి చర్మాన్ని తుడుచుకోవాలి. తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రోజువిడిచి రోజు ఇంట్లో తయారుచేసిన సహజసిద్ధమైన ప్యాక్‌లు వేసుకోవడం మంచిది. మొటిమలను ఎప్పుడూ గిల్లకూడదు. వీటిని తగ్గించుకోవడానికి యాంటీ యాక్నింగ్‌ క్రీమ్‌లు వాడాలి. ఇవన్నీ చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటన్నింటినీ పాటించి కాలుష్యం బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్ఛు’


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని