close

తాజా వార్తలు

Published : 05/07/2020 06:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ శ్రేయోభిలాషి అమ్మ!

- పి. లక్ష్మీశారద

రాత్రి పదిన్నర. శర్మ - శాంతి ఇద్దరికీ నిద్ర రావటంలేదు.
‘‘ఏమాలోచిస్తున్నారు?’’ అడిగింది శాంతి.
‘‘నీ గురించే... నువ్వంటే నాకు ఎందుకు భయం?’’ అడిగాడు శర్మ.
‘‘భయమా?’’ అని, అర్థంకానట్లు చూస్తూవుండిపోయింది శాంతి.
‘‘అవును... భయమే, నువ్వంటే నాకు భయం. అన్నీ నువ్వు చెప్పినట్లే చెయ్యాలి... ఆడపనులు, మగపనులతో సహా. బెడ్‌కాఫీ తాగకూడదంటావు. టిఫినైనా భోజనమైనా నువ్వు పెట్టిందే తినాలి. ఎవ్వరి ఇష్టాయిష్టాలతో నీకు పనిలేదు. నీకు నచ్చిన బట్టలే నేను కొనుక్కోవాలి. నువ్వు వేసుకోమన్నవే వేసుకోవాలి. షాపింగు, సినిమా, రెస్టరెంటూ... దేనికైనా అందరం కలిసివెళ్లాలంటావు. ఇక నేనైతే నీ అంగరక్షకుడిలా అనుక్షణం నీవెంటే ఉండాలి. నేను రిటైర్‌ అయినంత మాత్రాన నీకు సేవలు చేయాలా? నేను మగాడ్ని, నీ మొగుడ్ని అని కూడా చూడకుండా... ఇంటిపనీ, వంటపనీ కూడా నాతో చేయించుకుంటున్నావు. హిట్లర్‌లా డిక్టేటర్‌వి నువ్వు. అందరినీ శాసించటం నీకు సరదా. ముందు ముందు మేము ఊపిరి పీల్చుకోవాలన్నా నీ అనుమతి అవసరమేమో!’’
కళ్లలో నీళ్లు సుళ్లు తిరుగుతుంటే, శాంతి... మంచంమీద లేచి కూర్చుంది. శర్మచేతులు పట్టుకొని, ‘‘ఏంటండీ ఇది?’’ అంటూ భోరున ఏడ్చేసింది.
‘‘మీరేనా ఇలా మాట్లాడుతుంది? మనిద్దరి మధ్య ప్రేమానురాగాలేకానీ, భయానికి తావెక్కడండీ?’’ అంది వెక్కివెక్కి ఏడుస్తూనే.
శాంతి ఏడుపుచూసి, శర్మ కంగారుపడ్డాడు. కళ్లు చెమ్మగిల్లాయి. శాంతిమీద జాలివేసింది. ‘‘నన్ను క్షమించు శాంతీ, నిన్ను అనవసరంగా బాధపెట్టాను. నువ్వన్నట్లు మనమధ్య ఉన్నది ఆప్యాయతాను రాగాలేగానీ, మరొకటికాదు. ఇంతవరకూ నేను చెప్పిందంతా
మన రవి అంతరంగమే... ‘మమ్మీ
ముందు నువ్వు ‘డమ్మీ’వి, మమ్మీ అంటే నీకెందుకు భయం డాడీ’ అని అడిగాడు రవి. ‘ఏమో నాకేం తెలుసు? మమ్మీని అడిగిచెప్తాను అన్నాను’... చెప్పాడు శర్మ.
‘‘నిజంగా అంతేనా? మీరే నన్నలా అంటున్నారేమో అనుకుని భయపడిపోయాను’’ అంటూ శర్మను హత్తుకుపోయింది శాంతి.
శర్మ శాంతిని మరింత దగ్గరగా పొదివి పట్టుకుని, ‘‘కలలోనైనా నీ గురించి అలా తలపోయను. మన రవి అలా మాట్లాడేసరికి, వాడికి అర్థమయ్యేలా ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. అసలు వాడెందుకు ఇలా ఆలోచిస్తున్నాడో...’’ అన్నాడు శర్మ.
‘‘వాడింకా చిన్న పిల్లాడండీ, జీవితం పట్ల ఇంకా సరైన అవగాహనలేదు.
‘‘ఈ ఏడాదితో ఇంటర్‌ పూర్తయిందంటే, పై చదువులకు వేరే ఊరు వెళ్తాడు. హాస్టల్‌లో వున్నాడంటే వాడి పనులు వాడే చేసుకోక తప్పదు. ‘డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌’ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది.
‘‘నిజమేలే, బిడ్డకు ఎంత వయసొచ్చినా, తల్లికి చిన్నపిల్లాడే. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరుండగానే మంచిచెడులు చెప్పాలి. పిల్లలమీద ప్రేమతో పెద్దలు తమ బాధ్యతను విస్మరిస్తే, వాళ్లను మనమే చెడగొట్టిన వాళ్లమవుతాం. అయినా మన రెండు కుటుంబాల్లో ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరే. మరి వీడెందుకిలా తయారయ్యాడు?’’ అన్నాడు శర్మ.
‘‘మా అన్నయ్య లేడా? వాడు పళ్లు తోముకోవాలంటే, మా వదిన బ్రష్‌మీద పేస్టు వేసివ్వాలి. స్నానానికి నీళ్లు తోడాలి, టవల్‌ అందివ్వాలి, వేసుకునే బట్టలు తీసి పెట్టాలి, తల దువ్వుకోవటానికి దువ్వెన అందివ్వాలి. ఇక వాడు తింటున్నంతసేపూ మా వదిన పక్కన నుంచుని వడ్డిస్తుండాలి. అడిగినప్పుడల్లా మంచినీళ్లూ, కాఫీ టీలూ తెచ్చిస్తుండాలి. వాడు కాలూ చెయ్యీ కదపకుండా సోఫాలో కూర్చుంటాడంతే, భార్య అంటే వాడి దృష్టిలో ‘దాసి’.
మగ మహారాజులు ఇంట్లో ఏ పనులూ చేయకూడదని వాడి సిద్ధాంతం. వాడు బయటకు వెళ్తే ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. మావదిన, అర్ధరాత్రైనా వాడొచ్చేంతవరకూ తిండి తినకుండా ఎదురు చూస్తుంటుంది. గత మూడేళ్లుగా వేసవి సెలవులకు మన రవి వాడి దగ్గరకు వెళ్లొస్తున్నాడుగా? వాడిని చూసి మగవాళ్లంతా అలానే ఉండాలనుకుంటున్నట్లున్నాడు’’ అంది శాంతి.
‘‘సర్లే... టైము పదకొండు దాటింది. ఎంతవద్దన్నా పెందలకడే లేస్తావు. ఇక పడుకో’’ అన్నాడు శర్మ.
‘‘నిద్రొస్తేగా? మీరు రవి గురించి ఆలోచిస్తుంటే, నేను ‘భాను’ గురించి ఆలోచిస్తున్నాను. ఆడపిల్ల... పెళ్లయ్యాక అత్తారింట్లో ఎలా ఉంటుందో అని మన దగ్గరున్నంతవరకూ అతిగారాబం చేసి పెంచాం. ఇప్పుడు దానికి అత్తగారంటే పడటంలేదు.’’
‘‘పెద్దావిడ... కొంచెం చాదస్తం ఉంటే ఉండొచ్చు, మంచి చెడూ చెప్పటంలో తప్పులేదుగా... నచ్చితే చేయాలి, నచ్చకపోతే ఊరుకోవాలి’’.
‘‘అంతా ఆవిడకే తెలుసన్నట్లు మాట్లాడతారట. ఆవిడ పుట్టింటి గొప్పలు చెప్పి విసిగిస్తారట. తలకు నూనె రాసుకోమనీ, జడ అల్లుకోమనీ, బొట్టు పెట్టుకోమనీ, గాజులేసుకోమనీ, మంగళసూత్రం తీసి ఎక్కడపడితే అక్కడ పడవేయకూడదనీ మెడలో వేసుకుని ఉండాలనీ’ అంటారట. ఇంకా, ఫ్రిజ్‌లో పెట్టిన కూరలూ అవీ తినకూడదనీ... కర్రీపాయింట్లలో అమ్మేవి మంచివికాదనీ... ఇలా ఏవేవో అంటారట. ‘ఉద్యోగం చేసే వాళ్లకు ఆవిడ చెప్పేవన్నీ చెయ్యాలంటే ఎలా కుదురుతుంది... ఆవిడ ఇలాగే విసిగించేస్తే గట్టిగా సమాధానం చెబుతా’ అంటోంది భాను...’’ అంది శాంతి.
‘‘తప్పు తప్పు... అదేంమాట? తొందరపడి అత్తగార్ని ఏమీ అనొద్దని చెప్పకపోయావా?’’ అన్నాడు శర్మ.
‘‘చెప్పాను, పెళ్లయిన స్త్రీకి అత్తగారంటే అమ్మతో సమానం. ఆమె ఎలాంటివారైనా, పెద్దరికానికి ఇచ్చే గౌరవమర్యాదలు ఇచ్చేతీరాలి. ఆవిడలాగే నేను చెప్తే వింటావా, వినవా... నాతో కూడా గొడవపడతావా...’’ అంటే ‘మా అత్తగారికీ నీకూ పోలికేంటి’ అంది. నేను చాలా మంచిదాన్నట, నాకు రేపు కోడలొచ్చినా, నాలో ఏమార్పూ రాదట. మరి... నీ తమ్ముడేంటి నన్ను ‘హిట్లర్‌’ అంటున్నాడూ అంటే, ‘వాడ్ని తన్నాలి... వెధవ పెద్దాచిన్నా లేకుండా అంత మాటన్నాడా...’ అంది.’’
‘‘తమ్ముడు తల్లిని అంటే తప్పూ తను అత్తగారిని అంటే తప్పుకాదా? ఇంతకీ నీమాట వింటుందా? లేక నన్ను భానుతో మాట్లాడమంటావా?’’ అన్నాడు శర్మ.

‘‘అవసరం లేదు. అత్తగారు ఉన్నన్ని రోజులు ఎలాగోలా సర్దుకుపొమ్మన్నాను. ఆవిడ చెప్పిన విషయాలు మంచివేననీ, మన సంప్రదాయాన్ని గౌరవిస్తే అదే మనల్ని కాపాడుతుందనీ, మన కట్టూ బొట్టు వల్లే గౌరవమర్యాదలు దక్కుతాయనీ చెప్పాను. అల్లుడుగారు ఉత్తముడనీ... భానుని ఎంత ప్రేమగా చూసుకుంటాడో కన్నతల్లినీ అంతప్రేమగానూ గౌరవంగానూ చూసుకుంటాడనీ... అలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లీ, భర్తగా దొరికినందుకు భానూ ఇద్దరూ అదృష్టవంతులే అనీ చెప్పాను. అత్తాకోడళ్లు సఖ్యతగా ఉంటే... అల్లుడుగారు సంతోషంగా ఉంటారనీ, కనుక అమ్మమాట మీద గౌరవముంచి, అత్తగారింట్లో మంచిగా ఉండమని సలహా ఇచ్చాను’’ అంది శాంతి.
‘‘బాగా చెప్పావు, మరి భాను ఏమంది?’’ అడిగాడు శర్మ.
‘‘సరే... అలాగేలే... అంది. భాను మంచిదే... అది నాన్నకూతురు కదా!’’
అంది శాంతి.
‘‘అవును... నేనే కన్నానుకదా...’’ అన్నాడు శర్మ. ఇద్దరూ నవ్వుకున్నారు అంతే... ఇద్దరికీ నిద్రపట్టేసింది.

* * *

‘‘రా... రవీ మమ్మీ అంటే నాకెందుకంత భయం అని అడిగావుగా... చెప్తాను ఇలా కూర్చో’’ కొడుకుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శర్మ.
‘‘మనది ఓ చిన్న కుటుంబం... నేను, మీఅమ్మ, నువ్వు. అక్క పెళ్లై వెళ్లిపోయిందిగా మరి. మనం ముగ్గురమే ఇంత ఇంట్లో ఉంటున్నాం. నేను నాగదిలో, నువ్వు నీగదిలో, వంటగదిలో మీఅమ్మ... ఇలా ఎవరికి వాళ్లు ఎవరి ప్రపంచంలో వాళ్లుంటే అది కుటుంబం అనిపించుకోదు. రైల్లోనో, బస్సులోనో... ఎవరిసీట్లో వారు కూర్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఏ సంబంధంలేని అపరిచితుల్లా ప్రయాణం చేస్తున్నట్లే ఉంటుంది. ఇక, ఈ మొబైల్‌ ఫోన్లు, నెట్‌ వచ్చాక ఒకే ఇంట్లోనే ఉన్నా ఎవరి ప్రపంచం వారిది. మనుషుల మధ్య దూరం పెరిగింది.’’
‘‘అందుకనే... మీఅమ్మ, ‘అందరం కలిసి భోజనం చేద్దాం, ఎక్కడికి వెళ్లినా అందరం కలిసివెళ్దాం... ఏదైనా కొనాలన్నా అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం అనేది. అంటే... ఆ కాసేపైనా ఉన్న ముగ్గురం కలిసుంటామని.’’
‘‘నిజానికి నాకు ఏది నచ్చుతుందో... నాకంటే మీ అమ్మకే బాగాతెలుసు. అందుకనే తన సెలక్షనే నా సెలక్షను. మీ అమ్మకూడా తనకు నచ్చిందేదైనా, నాతో సంప్రదించాకే కొంటుంది. ఇలా ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తించి, గౌరవించటంలో ఉన్న ఆనందం వెనుక... నాకునువ్వు, నీకునేను... ఒకరికొకరం అనే అందమైన అనుబంధం దాగివుంది.’’
‘‘ఇక రిటైర్‌ అయిన తరువాత నాకు విశ్రాంతి దొరికినా... మీ అమ్మకు మాత్రం జీవిత ఖైదులా ఇంటిపనీ వంటపనీ శాశ్వత ప్రాతిపదికన స్థిరపడిపోయింది. మరి నాజీవిత భాగస్వామి కష్టపడుతుంటే, నేను మొద్దులా కూర్చుంటానా చెప్పు! అందుకనే నువ్వనుకునే అడపనుల్లో నా జోక్యం అన్నమాట. వండిపెట్టడం ఆడపనైతే, తినిపెట్టడం మగపని అని నీ ఉద్దేశమా చెప్పు. నువ్వు చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ నీకు చేసిన పనులన్నీ ఇప్పుడు నీకు నువ్వే చేసుకుంటున్నావుగా? అప్పుడు ఆడపనులు, ఇప్పుడు మగపనులుగా మారిపోయాయా?’’
రవి ముఖకవళికలను బట్టి... తను చెప్పేది పాజిటివ్‌గానే తీసుకున్నట్లు అనిపించింది. నెమ్మదిగా రవి భుజంమీద చెయ్యివేసి, దగ్గరగా జరిగి కూర్చున్నాడు శర్మ.
‘‘క్రమశిక్షణలో సమయపాలనలో కొంచెం స్ట్రిక్టుగానే ఉంటుంది మీ అమ్మ.
అదిచూసి, మీఅమ్మ ‘హిట్లర్‌’ అని నువ్వు అనుకుంటే... చాలా పొరపాటు... సోమరితనానికీ, విచ్చలవిడి తనానికీ పగ్గాలువేసి, మనసును నియంత్రిస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. ముఖ్యంగా నీ వయసు కుర్రాళ్ల భావి జీవితానికి ఆరోగ్యవంతమైన పునాది మీ అమ్మలాంటివాళ్ల పెంపకంలోనే పడుతుంది. మీ అమ్మ ఇంత పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా ఉంటుంది కనుకనే నాకు గౌరవంతోకూడిన భయం. అది నువ్వనుకునే పిరికితనం కాదు. అమ్మ ఏం చెప్పినా, ఏం చేసినా మనందరి మంచికే చేస్తుంది. అమ్మని ‘దాసి’లా కాదు మనందరి ‘శ్రేయోభిలాషి’లా చూడాలి’’. సుదీర్ఘంగా సాగిన శర్మ సమాధానం విని రవి ఆలోచనలో పడ్డాడు. తప్పు తెలుసుకున్నట్లే ఉన్నాడు, తన ప్రయత్నం ఫలించినట్లుగానే ఉందనిపించాక రవి అరచేతిని గట్టిగా నొక్కి, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు శర్మ.

* * *

‘‘రవీ... భాను ఫోనుచేసింది... నీతో మాట్లాడాలట’’ అంటూ శర్మ ఫోన్‌ రవికి ఇచ్చాడు.
‘‘అక్కా! కొంచెం పనిలో ఉన్నాను... మమ్మీకి హెల్ప్‌చేస్తున్నాను. ఈరోజు పనిమనిషి రాలేదు. డాడీకి జ్వరంగా
ఉంది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు?’’ అడిగాడు రవి.
‘‘ఈరోజు ఆదివారం... సెలవుకదా!
మా అత్తమ్మను, మిస్సమ్మ సినిమాకి తీసుకెళ్తున్నాను... డాడీతో మళ్లీ మాట్లాడతానని చెప్పు’’ అంది భాను.
రవి ద్వారా విషయం తెలుసుకున్న శర్మ, శాంతి నిండుగా నవ్వుకున్నారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని