
తాజా వార్తలు
చోరీకి వచ్చి... బావిలో పడి మృతి
రాఘవాపూర్ (స్టేషన్‌ఘన్‌పూర్), న్యూస్‌టుడే: చోరీ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని గ్రామస్థులు పట్టుకోవడానికి ప్రయత్నించగా చీకట్లో పరుగెత్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బావిలో మృతదేహాన్ని వెలికి తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవాపూర్ గ్రామ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల వద్దకు మూడు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు చోరీ చేయడానికి వచ్చారు. ఇళ్లలోని సెట్‌టాప్ బాక్స్‌లు, చరవాణులను దోచుకోవడం వీరి నైజం. శనివారం రాత్రి వీరు ముగ్గురూ చోరీకి పాల్పడుతుండగా గమనించిన గ్రామస్థులు వారిని పట్టుకోవాలని ప్రయత్నించారు. ఇద్దరు పరారవగా ఫరీజ్ఖాన్ దొరకడంతో అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇతనిపై పలు కేసులు హైదరాబాద్ పరిధిలో నమోదవడంతో హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించి బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారైన ఇద్దరిలో ఓ వ్యక్తి రహదారి సమీపంలోని బావిలో పడి మృతిచెందాడు. ఆదివారం ఉదయం మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికితీసి ఆచూకీ కోసం ప్రయత్నించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. బావి పక్కనే చోరీచేసిన సెట్‌టాప్ బాక్స్‌లు లభించాయి. దీంతో చోరీకి వచ్చి బావిలో పడి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ధైర్యం చేసిన కానిస్టేబుల్..
బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమారస్వామి అనే కానిస్టేబుల్ ధైర్యంగా ముందుకొచ్చాడు. క్రేన్ సాయంతో ఓ మంచం పట్టుకుని బావిలోకి దిగి మృతదేహాన్ని తాడుతో మంచానికి కట్టి పైకి తీసుకువచ్చారు. దీంతో అతన్ని గ్రామస్థులు, పోలీసులు అభినందించారు.