ఆ ఆడపిల్లే ఆధారమైంది...
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 03:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఆడపిల్లే ఆధారమైంది...

తల్లిదండ్రుల అనారోగ్యం ఆ అమ్మాయి చదువును ముందుకు సాగనివ్వలేదు. బడికి వెళ్లాల్సిన ప్రాయంలో కాడెద్దులను తోలుకుని పొలం బాట పట్టింది. అన్నదాతగా మారి అక్కల పెళ్లిళ్లు చేసింది. చెల్లిని ఉన్నత చదువులు చదివిస్తోంది. అప్పుల ఊబి నుంచి కుటుంబాన్ని గట్టెక్కించింది. ఇదంతా చేసింది ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి. ఆడపిల్ల ఏం చేయగలదన్నవారందరితోనూ ఔరా అనిపించుకుంటోంది. ఆమే విజయలక్ష్మి.

‘సంకల్పం గట్టిదైతే... కొండనైనా ఢీకొట్టొచ్చు’ అని ధీమాగా చెప్పే విజయలక్ష్మిది అనంతపురం జిల్లాలోని పెదవడుగూరు మండలం కొట్టాలపల్లి. ఆదినారాయణ, ఆదిలక్ష్మి దంపతుల  నలుగురమ్మాయిల్లో మూడోది. ఆ తండ్రి తనకున్న ఎనిమిదెకరాల్లో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలలు కనేవాడు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు వారి కుటుంబాన్ని కుదిపేశాయి. ఎనిమిదేళ్ల కిందట తల్లి వెన్నెముక ఆపరేషన్‌తో మంచానికే పరిమితమైంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తర్వాత కొంతకాలానికి తండ్రీ అనారోగ్యానికి గురై నడవలేనిస్థితికి చేరుకున్నాడు. అప్పటికే వ్యవసాయం, వైద్యఖర్చులకోసం అప్పులు పెరిగి మోపెడయ్యాయి. దాంతో ఇల్లు గడవడమే కష్టమైంది.
ఆ భారం భుజాలపై... ఈ పరిస్థితులు వారిని ఆందోళనలోకి నెట్టాయి. దాంతో చిన్నదైనా విజయలక్ష్మి ధైర్యంగా కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా 13 ఏళ్ల వయసులో పొలం బాట పట్టింది. కానీ వ్యవసాయం చేయడం మాటలేం కాదు. ట్రాక్టర్లతో దుక్కిదున్నడం, కూలీలను పెట్టుకుంటే పెద్ద ఎత్తున పెట్టుబడి కావాలి. ఆ ఖర్చులు తగ్గించుకునేందుకు కాడెద్దులతో దుక్కి దున్నడం ప్రారంభించింది. క్రమంగా వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంది. ఈ క్రమంలో ప్రకృతి విపత్తులు పరీక్షించాయి. పంటకు ధర రాక నష్టాలూ వచ్చాయి. అయినా వెనకడుగు వేయలేదు. మరో నాలుగెకరాలను కౌలుకు తీసుకుని పత్తితోపాటు కంది సాగుచేసింది. క్రమంగా వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించింది. కొద్దికొద్దిగా అప్పులు తీర్చుకుంటూ వచ్చింది. అక్కలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లూ చేసింది. చెల్లిని ప్రస్తుతం డిగ్రీ చదివిస్తోంది. ‘అమ్మనాన్నలు ఉన్నంతలో మాకు అన్నీ సమకూర్చారు. వారు అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉంటే చూస్తు ఎలా ఉండగలం. అందుకే కుటుంబ బాధ్యతలను నేను తీసుకున్నా. మొదట్లో అంతా ఆడపిల్ల ఏం చేయగలదు అన్నారు. ఇప్పుడు శెభాష్‌ అంటున్నారు’ అంటోంది విజయలక్ష్మి.

- అంజప్ప, అనంతపురం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని