నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు: మమత
close

తాజా వార్తలు

Published : 17/04/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు: మమత

గల్సీ: పశ్చిమ్‌బెంగాల్‌లో ఆడియో క్లిప్‌ వివాదం కలకలం సృష్టిస్తోంది. కోచ్‌బిహార్‌ కాల్పుల ఘటన తర్వాత మృతదేహాలతో ర్యాలీ నిర్వహించాలని తృణమూల్‌ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ నేతలకు సూచించినట్లున్న ఆడియో వివాదానికి తెరలేపింది. దీనిపై దీదీ నేడు స్పందించారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని, దానిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు తెలిపారు. 

గల్సీలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత.. ఆడియో క్లిప్‌ వెనుక భాజపా కుట్ర ఉందని ఆరోపించారు. అభివృద్ధి పథకాలపై ప్రచారంలో తమతో సరితూగలేక పోతున్నందువల్లనే కాషాయ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ‘‘వారు(భాజపా నేతలు) మన రోజువారీ సంభాషణలపై కూడా దృష్టి పెట్టినట్టున్నారు. మన ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు అన్పిస్తోంది. దీనిపై నేడు సీఐడీతో దర్యాప్తు జరిపిస్తా. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొందరు ఏజెంట్లతో కలిసి కేంద్ర బలగాలు ఇవన్నీ చేస్తున్నట్లుగా అన్పిస్తోంది’’ అని దీదీ ఆరోపించారు. 

రాష్ట్రంలో ఈ నెల 10న నాలుగో విడత ఎన్నికల వేళ కోచ్‌బిహార్‌లోని సితాల్‌కుచి నియోజకవర్గ పరిధిలో కాల్పులు జరిగాయి. అనంతరం అక్కడి అభ్యర్థితో మమతా బెనర్జీ సాగించినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణ ఒకటి శుక్రవారం కలకలం సృష్టించింది. భాజపా ఐటీ విభాగం అధినేత అమిత్‌ మాలవీయ ఈ మేరకు సంబంధిత ఆడియో క్లిప్‌ను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. అందులోని సంభాషణ దీదీ, సితాల్‌కుచి తృణమూల్‌ అభ్యర్థి పార్థప్రతీమ్‌ రే మధ్య జరిగిందేనని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడగా.. వారి మృతదేహాలతో మరుసటి రోజు ర్యాలీ నిర్వహించాలని పార్థప్రతీమ్‌కు మమత సూచించినట్లు ఆడియోలో స్పష్టంగా ఉందన్నారు. న్యాయవాదిని సంప్రదించి.. జిల్లా ఎస్పీ, కేంద్ర బలగాలు తప్పించుకోలేని రీతిలో కాల్పుల ఘటనపై కేసు పెట్టాలని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను తృణమూల్‌ తీవ్రంగా ఖండించింది. భాజపా విడుదల చేసిన ఆడియో క్లిప్‌ బూటకపు సృష్టి అని పేర్కొంది. అందులో ఉన్నట్లు దీదీకి, తనకు మధ్య సంభాషణ ఏదీ జరగలేదని పార్థప్రతీమ్‌ తేల్చిచెప్పారు. ప్రజలను గందరగోళ పరచేందుకు కమలదళం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని