Puri Musings: భవిష్యత్తు దారుణంగా ఉండనుంది

తాజా వార్తలు

Updated : 15/05/2021 14:56 IST

Puri Musings: భవిష్యత్తు దారుణంగా ఉండనుంది

వైరస్‌లకు దూరంగా ఉండాలంటే ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’

హైదరాబాద్‌: వైరస్‌ల నుంచి దూరంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటే తప్పకుండా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ను అవలంభించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సూచించారు. భవిష్యత్తు ఎంతో దారుణంగా ఉండనుందని.. కాబట్టి ప్రతిఒక్కరూ ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ను అలవాటు చేసుకోవాలంటూ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా పలు సందేశాత్మక అంశాలతో అందర్నీ ఆకట్టుకుంటోన్న ఆయన తాజాగా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’ గురించి ఎన్నో విశేషాలు బయటపెట్టారు. ఇంతకీ ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ అంటే ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

‘‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్’‌.. నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో ప్రకృతిలో ఎలాంటి ప్రజా వినియోగాలు లేకుండా బతకడం. ‘లివింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌’ అంటే మంచినీళ్లు‌, కరెంటు, గ్యాస్‌, ఇంటర్నెట్‌.. ఈ విధమైన రకాలైన మౌలిక వసతులు లేకుండా జీవించడం. స్వయం సమృద్ధ జీవనశైలి. గోయింగ్‌ ఆఫ్‌ ది గ్రిడ్‌ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అలా చేయాలంటే సరైన ప్రదేశాన్ని చూసుకుని ముందు ఇల్లు నిర్మించుకోవాలి. సోలార్‌ లాంటి పవర్‌ సోర్సులు పెట్టుకోవాలి. కుదిరితే వర్షం నీటిని సైతం ఉపయోగించుకునేలా చూసుకోవాలి.’

‘‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ను ఫాలో అయ్యేవాళ్లు కమ్యూనికేషన్‌ కోసం శాటిలైట్‌ ఫోన్‌ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకుంటారు. పశువులు, కోళ్లను పెంచుకుంటారు. పర్యావరణసహిత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. పశువుల పేడతో గోబర్‌ గ్యాస్‌ తయారు చేస్తారు. దాన్నే పంటలకు ఎరువుగా కూడా వాడతారు. అన్నిరకాల చెట్లు పెంచుకుంటారు. ధాన్యం, మొక్కజొన్న కూడా పండిస్తారు. వాళ్లకి కరెన్సీతో పనిలేదు. అప్పులు లేని జీవితం. జీవితాంతం ప్రతినెలా ఎవ్వరికీ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. అప్పులవాళ్లు వచ్చి వాళ్ల ఇంటి తలుపులు కొట్టరు. ఎలాంటి నోటీసులు వాళ్ల ఇంటికి రావు’

‘ప్రపంచంలో 35మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పర్యావరణం పట్ల వీళ్లు ఎంతో బాధ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. వీళ్లు సైతం ఆనాటి పూర్వీకుల జీవనశైలిని ఫాలో అవుతుంటారు. అప్పట్లో అందరిదీ ‘ఆఫ్‌ గ్రిడ్‌ లివింగే’ కాబట్టే మన భూమి ఎంతో పచ్చగా ఉండేది. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  100 డైనోసార్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి కూడా గుర్తు ఉండదు. కానీ నలుగురు మానవులు బతికి చనిపోయిన తర్వాత చూస్తే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే ప్రకృతి మనల్ని గుర్తు పెట్టుకుంటుంది’

‘మనకి ప్రకృతిలో బతకడం రాదు. ఆఫ్‌ గ్రీడ్‌గా జీవించేవాళ్లు ఈ ప్రకృతికి ఎంతో అవసరం. మనందరం జీవితంలో ఇలాంటి ఆఫ్‌ గ్రిడ్‌ ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వైరస్‌ల నుంచి దూరంగా సంతోషంగా బతకాలంటే ఇలాంటిది మనకి కావాలి. పట్టణాలకు దూరంగా ఇలాంటి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండనుంది. మీ పిల్లలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అది ఇదే. దగ్గరలో ఆస్పత్రి లేకపోతే ఎలా అని భయపడొద్దు. అక్కడ రోజూ పనిచేసుకుంటూ బతికితే మీకు ఎలాంటి జబ్బులు ఉండవు. పోతే వృద్ధాప్యంతోనే పోతారు. నీటిలో చేపల్లాగా, గాలిలో పక్షుల్లాగా, అడవిలో జంతువుల్లాగా.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా హాయిగా బతికే మార్గం ఆఫ్‌ ది గ్రిడ్‌. వెనక్కెళ్లి బతుకుదాం. ముందుకెళ్లి పీకేది ఏమీ లేదు’’ అని పూరీ వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని