close
భీతావహం 

సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో పెను విధ్వంసం 
కొలంబో

స్టర్‌ ఆదివార పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో పెను విధ్వంసం చోటుచేసుకుంది. నెగోంబో పట్టణంలో ఉన్న ఈ ప్రార్థనా స్థలంలో 104 మంది చనిపోగా, మరో 100 మంది గాయపడ్డారు. చర్చి ముందుభాగంలో దాదాపు 30 మృతదేహాలు పడి ఉన్నాయి. పేలుడు తీవ్రతకు చర్చి పైకప్పు చెల్లాచెదురయింది. నేల మొత్తం రక్తపు మడుగులు, తెగిపడ్డ అవయవాలు, టైల్స్‌, గాజు పెంకులు, కలప శకలాలతో నిండిపోయింది. గోడల నిండా రక్తపుచారలే ఉన్నాయి. 
బాంబు దాడి జరిగే సమయానికి అక్కడ ఈస్టర్‌ ప్రార్థనలు జరుగుతున్నాయి. దీనికి వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. అనేక మంది సమీపంలోని గ్రామాల నుంచీ తరలివచ్చారని మతపెద్ద ఫాదర్‌ ఎడ్మండ్‌ తిలకరత్నే చెప్పారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ముగ్గురు పాస్టర్లు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, దైవ పీఠం వెనుక ఉండటంతో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. చర్చి వెలుపల కూడా భీతావహ వాతావరణం ఉంది. ఇది ఆత్మాహుతి దాడి అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. 
ఈ ప్రార్థనా స్థలాన్ని 1946లో నిర్మించారు. క్యాథలిక్‌ చర్చి చరిత్రలో అమరుడిగా గుర్తింపు పొందిన సెయింట్‌ సెబాస్టియన్‌కు దీన్ని అంకితం చేశారు. శ్రీలంకలో బౌద్ధులు అధికం. జనాభాలో వీరు 70.2శాతం మేర ఉన్నారు. హిందువులు 12.6శాతం మంది, ముస్లింలు 9.7శాతం మంది ఉన్నారు. క్యాథలిక్‌ విశ్వాసాన్ని పాటించేవారు దాదాపు 7.6 శాతం మంది. 

ఏడుగురు అనుమానితుల అరెస్టు 
శ్రీలంకలో వరుస పేలుళ్లకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అక్కడి ప్రభుత్వ రక్షణ విభాగ వర్గాలు వెల్లడించాయి. తనిఖీల సందర్భంగా ఓ ఇంటిలో అనుమానాస్పదంగా ఉన్న వీరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినందున ప్రజలు ఇళ్లను వీడి బయటకు రావద్దని రక్షణశాఖ సహాయ మంత్రి రువన్‌ విజేవర్దనే కోరారు. పేలుళ్లలో అత్యధికం ఆత్మాహుతి దళ సభ్యుల దాడుల వల్లే జరిగాయని పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

10 రోజుల ముందే హెచ్చరిక జారీ 
ఆత్మాహుతి దాడులకు భారీ కుట్ర జరుగుతోందని విదేశీ నిఘా సంస్థ ఒకటి పది రోజుల క్రితమే శ్రీలంకకు సమాచారం అందించింది. దీంతో ఈ నెల 11న శ్రీలంక పోలీస్‌ ఛీఫ్‌ పుజుత్‌ జయసుందర దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు సూచిస్తూ తనకందిన నిఘా వర్గాల నివేదికనూ జత చేశారు. నేషనల్‌ తౌహేత్‌ జమాత్‌ (ఎన్‌టీజే) అనే ముస్లిం తీవ్రవాద సంస్థ.. దేశంలోని ప్రముఖ చర్చీలు, కొలంబోలోని భారతీయ హైకమిషన్‌ లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నుతోందన్న సమాచారం ఆ నివేదికలో ఉంది. గత ఏడాది బుద్ధుని విగ్రహాల విధ్వంసానికి పాల్పడటం ద్వారా ఎన్‌టీజే శ్రీలంకలో ఉనికిని చాటుకుంది. దాడులపై గట్టి సమాచారం అందినప్పటికీ నివారించలేకపోవటంతో భారీ ప్రాణనష్టం జరిగింది.

బఫేకు వచ్చి.. వరుసలో నిల్చొని..! 
సినామన్‌లో పేల్చుకున్న ఆత్మాహుతి బాంబర్‌

కొలంబో: శ్రీలంకలోని సినామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో భారీ విధ్వంసానికి పాల్పడిన ఆత్మాహుతి బాంబర్‌ అంతకుముందు అల్పాహారం బఫే వరుసలో ఓపిగ్గా నిల్చున్నాడు. హోటల్‌లో తన పేరును ‘మహ్మద్‌ అజ్జామ్‌ మహ్మద్‌’గా నమోదు చేసుకున్న అతను వీపు భాగంలో బాంబులను అమర్చుకున్నట్లు హోటల్‌ మేనేజర్లలో ఒకరు తెలిపారు. ‘‘హోటల్‌లోని టేప్రొబీన్‌ రెస్టారెంటులో ఈస్టర్‌ సెలవు వారాంతం ఏడాదిలోనే అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో ఒకటి. ఆదివారం ఉదయం అనేక కుటుంబాలు రావడంతో కిక్కిరిసి ఉంది. బఫే వరుసలో ముందువరకు వచ్చిన ముష్కరుడు తనకు వడ్డించడానికి కొద్దిసేపటి ముందు బాంబులు పేల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. అతిథులకు ఆహ్వానం పలుకుతున్న మా మేనేజర్లలో ఒకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. బాంబర్‌ కూడా మృత్యువాత పడ్డాడు. అతని మృతదేహం భాగాలను కనుగొన్న పోలీసులు వాటిని తీసుకెళ్లారు’’ అని ఘటనను ఆ మేనేజర్‌ వివరించారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని జాతీయ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. శ్రీలంకకు చెందిన ఆ బాంబర్‌ ఇచ్చిన చిరునామా తప్పుగా తేలినట్లు హోటల్‌ సిబ్బంది తెలిపారు. వ్యాపారం నిమిత్తం తాను కొలంబోకు వచ్చినట్లుగా అతను చెప్పాడన్నారు. ఈ హోటల్‌ శ్రీలంక ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి సమీపంలో ఉండగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమాండోలు హుటాహుటిన రంగంలోకి దిగాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.