close

ప్రధానాంశాలు

ఆర్టీసీ కథ ముగిసినట్లే!

నా చేతుల్లో ఏమీ లేదు.. ఎవరూ బాగు చేయలేరు
 జీతాలివ్వాలంటే నాలుగు బస్‌స్టాండ్లను అమ్మాల్సిందే
   భూగోళం ఉన్నంత వరకు విలీనం సాధ్యం కాదు
 త్వరలో కీలక నిర్ణయం.. ఆరేడు వేల బస్సులకు పర్మిట్లు
 ఇకపై ఎవరు సమ్మె చేసినా కఠిన చర్యలే
   విధుల్లో చేరాలనుకుంటే డిపోలకు వెళ్లి దరఖాస్తులివ్వాలి
కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు

సమ్మె ముసుగులో సంఘాలు అమాయక కార్మికుల గొంతు కోస్తున్నాయి. వాటి ఉచ్చులో పడి కార్మికులు తమ రక్తం తామే పీల్చుకుంటున్నారు. సంస్థను కాలబెట్టుకుంటున్నారు.
సీఎంను తిట్టడం సంస్కారమా? ఏది పడితే అది అడిగితే ప్రభుత్వం ఇవ్వాలా? ప్రభుత్వం కూలిపోతుందని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు కూలిపోతున్నారో తెలుస్తోంది కదా? సంస్థే పోతుంటే ఇక సంఘాలు ఎందుకు?
ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు అడిగితే చేస్తారా? ప్రభుత్వంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. వారు కూడా విలీనం కోరితే ఏం చేయాలి. ఆర్టీసీని చేశారు. వీరిని ఎందుకు చేయరని కోర్టులు ఆదేశిస్తే అప్పుడేం చేయాలి? ప్రభుత్వానికి ఓ పద్ధతి, విధానం ఉంటాయి కదా!
- ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ఆర్టీసీది దాదాపుగా ముగిసిన చరిత్రేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రపంచంలో ఎవరూ బాగు చేయలేరని అన్నారు. ఇక ఆర్టీసీని మర్చిపోవాల్సిందేనని అన్నారు.. ‘నా చేతుల్లో కూడా లేదు.. ఎవరూ కాపాడలేరు. పాత ఆర్టీసీ ఉండే అవకాశం ఇక లేదు’ అని స్పష్టం చేశారు. సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదన్నారు. చిల్లర రాజకీయాలతో కార్మిక సంఘాలు సంస్థ భవిష్యత్‌ను నాశనం చేశాయన్నారు. ఈ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు అని తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేక చేతులెత్తేస్తోందని అన్నారు. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్మికులకు నాలుగేళ్ల లోపు 67 శాతం వేతనాలు పెంచామని తెలిపారు. కార్మికులు ఎవరైనా ఆర్టీసీలో పనిచేయాలనుకుంటే డిపోల వద్దకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వారిని తీసుకున్నా పరిస్థితి మారదని, ఏమయ్యేదీ త్వరలో బయటపడుతుంది చూడండని వ్యాఖ్యానించారు. గురువారం హుజూర్‌నగర్‌ ఎన్నికల ఫలితంపై విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన ఆర్టీసీ సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక పిచ్చి సమ్మె అని, బుద్ధి జ్ఞానం లేనిదని, చట్టవ్యతిరేకమని అన్నారు. ఇప్పటికే ఎస్మా చట్టం అమల్లో ఉందని వెల్లడించారు. కార్మికుల ఆత్మహత్యలకు సంఘాలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇక నుంచి ఎవరు సమ్మె చేసినా ఇలాంటి చర్యలే ఉంటాయన్నారు. ఆర్టీసీ విలీనంపై ఏపీలో ఒక ప్రయోగం చేశారని, కాని అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు.

ఇప్పుడా సమ్మె చేసేది?
‘దేశాన్ని ఆర్థిక మాంద్యం తీవ్రంగా వేధిస్తోంది. పరిస్థితి చూసి రాష్ట్ర బడ్జెట్‌ను తగ్గించుకున్నాం. ఆర్టీసీకి రూ. 5,000 కోట్ల అప్పులున్నాయి. నెలకు రూ. 100 కోట్ల చొప్పున నష్టం వస్తోంది. అద్దె బస్సులు లాభాల్లో నడుస్తున్నాయి.. ఆర్టీసీ బస్సులు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. కిలోమీటరుకు రూ. 13 నష్టం ఎలా వస్తోంది? రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నడుస్తున్నాయి? ఒక్క ఆర్టీసీయే ఎందుకు నష్టాల్లో ఉంది?ఉమ్మడి రాష్ట్రంలో రూ. 712 కోట్లు ఇస్తే.. మా ప్రభుత్వం  రూ. 4,250 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 550 కోట్లు కేటాయించాం. 2,600 బస్సులకు కాలం చెల్లింది. కొత్తవి కొనాలంటే రూ. వెయ్యి కోట్లు కావాలి. అదనపు ఆదాయం వచ్చే పండుగల వేళ సమ్మె చేశారు. నోటీస్‌ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నేరుగా చర్చించదు. సీనియర్‌ ఐఏఎస్‌లతో కమిటీ వేశాం. వారు నివేదిక ఇస్తే నిర్ణయం తీసుకుంటాం. పండుగ సమయంలో సమ్మె వద్దు అని చెప్పాం. ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఊరుకోం అంటే ఎలా? ఆర్టీసీ దగ్గర రూపాయి లేని పరిస్థితి. సెప్టెంబరు జీతాలు ఇవ్వాలని కోర్టులో కేసు వేశారు. ఇవ్వకపోతే హైకోర్టు ఏం చేస్తది? కొడతదా? కోర్టులో అబద్ధాలు చెబుతున్నారు. పీఎఫ్‌ డబ్బులు ప్రభుత్వం వాడుకుంటుందా?

మోదీ కొత్త చట్టం తెచ్చారు
మోదీ ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ చట్టం తెచ్చింది. అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇకపై ఆర్టీసీ ఆధిపత్యం ఉండదు. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవచ్చు. దీంతో సేవలు మెరుగుపడతాయి. ఛార్జీలు తగ్గుతాయి.

నాకు పూర్తి అవగాహన ఉంది
ఆర్టీసీపై నా కంటే ఎక్కువగా ఎవరికీ అవగాహన లేదు. మూడుసార్లు రవాణా మంత్రిగా పనిచేశాను. 1997లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో నడిపించాను. మా ప్రభుత్వం వచ్చాక కార్మికులకు 44 శాతం వేతనాలు పెంచాం. మరోసారి 14 శాతం మధ్యంతర భృతి ఇచ్చాం. నాలుగేళ్ల కాలంలో 67 శాతం జీతాల పెంపు ఎక్కడైనా ఉందా? అయినా గొంతెమ్మ కోరికలు కోరితే అర్థం ఉందా? ఈ అరాచక వ్యవస్థలను ప్రతిపక్షాలు పోత్సహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీయే లేదు. పశ్చిమబెంగాల్‌లో 10 కోట్ల జనాభా ఉంటే 200 బస్సులే ఉన్నాయి. ఆర్టీసీ 40 ఏళ్ల చరిత్రలో ప్రతి ప్రభుత్వంలో సమ్మెకు వెళ్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించి మాట్లాడమనండి.

హైకోర్టుకు తీర్పు చెప్పే అధికారం లేదు
కార్మికుల డిమాండ్లు అమలు చేయాలని చెప్పే అధికారం తమకు లేదని హైకోర్టు ఇప్పటికే పేర్కొంది. కోర్టు కాదంటే ఈ అంశం లేబర్‌ కోర్టుకు వెళ్తుంది. అక్కడ ఆర్టీసీని వేతనాలు ఇవ్వాలని ఆదేశిస్తుంది. సంస్థ వద్ద డబ్బుల్లేవు. అప్పుడు నాలుగు బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి. మా దగ్గరా డబ్బుల్లేవు.  ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు సగటున రూ. 50,000 జీతం వస్తోంది. అవసరమైనప్పుడు గంట ఎక్కువ పనిచేయలేరా? పంట పండే రైతు టైం చూసుకుని పని చేస్తాడా? ఇలా చేస్తే ఆర్టీసీ మునగక తప్పదు మరి.

వారితో పంచాయితీ లేదు
లాభాలు తెస్తున్న అద్దెబస్సులు వద్దని డిమాండు చేస్తారా? కార్మికులు మంచోళ్లే. పంచాయితీ అంతా సంఘాలతోనే. సంఘాలు లేకుండా పనిచేస్తే కార్మికులు రెండేళ్లలో రూ. లక్ష బోనస్‌ తీసుకుంటారు. తెలంగాణ కోసం ఆర్టీసీ వాళ్లే కాదు. అందరూ ఉద్యమించారు.

సంఘాలతో బెంగాల్‌కు నష్టం
పశ్చిమబెంగాల్‌లో సీపీఎం పాలన వచ్చాక సంఘాలు పెరిగి పరిశ్రమలు మూతపడ్డాయి. కోల్‌కతా మృత్యునగరంగా మారింది. భవనాలకు సున్నమేసుకున్నా సంఘాలు చందాలు వసూలు చేసేవి. మమతా బెనర్జీ సీఎం అయ్యాక పరిస్థితి మారింది.

చేయాల్సివి చాలా ఉన్నాయి
రెవెన్యూ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తాం. వీఆర్వోల తొలగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తాం. నిరుద్యోగుల భృతికి మార్గదర్శకాలు ఖరారు చేయాలి. సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగుల్ని పిలిచి మాట్లాడతాం. నగరంలోని కాలుష్య పరిశ్రమలను శివార్లకు తరలిస్తాం.’’ అని కేసీఆర్‌ చెప్పారు. ఆల్విన్‌ మాదిరే ఆర్టీసీ పరిస్థితి ఉందా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అంతకంటే దారుణంగా ఉందని సీఎం చెప్పారు. లాకౌట్‌ అవుతుందా అని అడగగా ఎందుకు కాదు? అని ఆయన వ్యాఖ్యానించారు. సెల్ఫ్‌ డిస్మిస్డ్‌పై తన వ్యాఖ్యలు వంద శాతం నిజమని అన్నారు. సంస్థకు రూ. 50,000 కోట్ల ఆస్తులున్నాయనేది పూర్తిగా అవాస్తమన్నారు. దీనిని నడిపించేందుకు ఎవరికీ ధైర్యం లేదని వ్యాఖ్యానించారు.

త్వరలో గల్ఫ్‌ పర్యటన
పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం 

ఈనాడు, హైదరాబాద్‌: గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికులను స్వగ్రామాలకు తీసుకొని రావాలనుకుంటున్నాం. ఈ సమస్య ఉన్న 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో దీపావళి తర్వాత గల్ఫ్‌ వెళతాను. బిహార్‌, ఒడిశా రాష్ట్రాల వారు ఇక్కడ పనిచేస్తుంటే మన బిడ్డలు ఎక్కడో బతకడం సరికాదు. సరైన విద్యార్హతలు లేకుండా వెళ్లినవారు మోసపోతున్నారు. ఇలాంటివి జరగవద్దు. న్యాక్‌ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఇక్కడే పనులు కల్పిస్తాం. గల్ఫ్‌ నుంచి వచ్చిన వారి సంక్షేమానికి ప్రత్యేక విధానం తెస్తాం. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను. ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం జరిపి, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటాను. సుప్రీంకోర్టులో కేసు పరిష్కారం అయితే హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తాం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.