close

ప్రధానాంశాలు

ముంచేసిన మృత్యువు

కరీంనగర్‌ కాకతీయ కాల్వలో ఘోరం
  పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృత్యువాత
  కారు, ముగ్గురి మృతదేహాలు లభ్యం
  మూడు వారాలుగా జల సమాధి!

మృత్యువు ప్రమాదాల రూపంలో ఆ కుటుంబాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. నలుగురు సభ్యులు కల ఆ ఇంట్లో ఓ ప్రమాదం కుమారుడిని బలిగొనగా ఇప్పుడు తక్కిన ముగ్గుర్నీ కరీంనగర్‌ సమీపంలోని కాకతీయ కాలువ తనలో కలిపేసుకుంది. ఇదే కాలువలో ఒక మహిళ గల్లంతవడంతో గాలిస్తుండగా ఈ మృత్యుఘోరం ఎదురై పోలీసులు ఖిన్నులయ్యారు. ఈ ముగ్గురూ కనిపించక మూడు వారాలవుతుండగా పోలీసులు ఈ కాలువలో గాలించకపోతే వీరి మృతి మిస్టరీ ఎప్పటికి తేలేదో?

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

కరీంనగర్‌ సమీపంలోని అలుగునూరు రాజీవ్‌ రహదారిపై కాకతీయ కాలువలో ఘోరం చోటుచేసుకుంది. సుమారు 21 రోజుల కిందట ఇంట్లోంచి కారులో బయల్దేరిన ముగ్గురు కుటుంబసభ్యులు సోమవారం విగతజీవులై కనిపించారు. కరీంనగర్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నరెడ్డి సత్యనారాయణరెడ్డి(55), ఆయన భార్య రాధ(50), కూతురు వినయశ్రీ(21) కారులోనే జలసమాధి అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. సత్యనారాయణరెడ్డి భార్య రాధ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా చెల్లెలు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సత్యనారాయణరెడ్డి కరీంనగర్‌లో ఎరువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కూతురు వినయశ్రీ నిజామాబాద్‌లోని ఓ దంతకళాశాలలో బీడీఎస్‌(తృతీయ సంవత్సరం) చదువుతోంది.

హైదరాబాద్‌ వెళ్తున్నామని చెప్పారు
గత నెల 26న హైదరాబాద్‌ వెళ్తున్నట్టు సత్యనారాయణరెడ్డి చెప్పారని ఎరువుల దుకాణంలో పనిచేసే కార్మికుడు నర్సింగ్‌ తెలిపాడు. వారి ప్రయాణానికి కావాలంటే ఆ రోజు రాత్రి గ్యాస్‌ సిలిండర్‌, రైస్‌కుక్కర్‌, దుప్పట్లు, చాప తదితర వస్తువులు తాను కారులో పెట్టానని వివరించాడు.
అదే నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు రాధ ఫోన్‌ చేసి యజమాని ఫోన్‌ రీఛార్జి చేయమని చెబితే రీఛార్జి చేయించానన్నాడు. మరుసటి రోజు కాల్‌ చేస్తే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిందని వివరించాడు. వారి జాడ తెలియకపోవడంతో కొద్ది రోజుల క్రితం సత్యనారాయణరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమోనని వెదికినా ప్రయోజనం లేకపోయినట్టు తెలిసింది. కాకతీయ కాలువ వంతెన నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో కాలువలో కారు కనిపించింది. నర్సింగ్‌ పెట్టానని చెబుతున్న సామగ్రి కారులో లేవు.

ఆమె కోసం వెతికితే.. వీళ్లు!
ఆదివారం రాత్రి కాకతీయ వంతెనపై నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్న గన్నేరువరానికి చెందిన దంపతులు ప్రదీప్‌, కీర్తనలు అదుపుతప్పి కాలువలో పడిపోయారు. రాత్రి వేళ కావడం.. కాలువ చెంతన పురుగులు కళ్లల్లో పడటంతో ద్విచక్రవాహనదారు ప్రమాదం బారిన పడ్డారని పోలీసులు భావించారు. స్థానికులు ప్రదీప్‌ను తాళ్ల సాయంతో పైకి లాగారు. భార్య కీర్తన నీళ్లలో కొట్టుకుపోయారు. ఎల్‌ఎండీ నుంచి కిందకు పారే నీటి ఉద్ధృతిని తగ్గించి ఆమె కోసం వెదికారు. ఆదివారం అర్ధరాత్రి ఆమె మృతదేహం లభ్యమైంది. సోమవారం ఉదయానికి నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో ఇదే కాలువలో ఓ కారు కనిపించింది. ఎల్‌ఎండీ ఠాణా ఎస్సై నరేశ్‌రెడ్డి సహా సిబ్బంది సంఘటనా స్థలికి వెళ్లి క్రేన్‌ సాయంతో కారును వెలికితీశారు. అందులో ముగ్గురి మృతదేహాలున్నాయి. కారు నంబరు ఆధారంగా మృతులను గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కాల్‌డేటాలతోపాటు సమీపంలోని టోల్‌ప్లాజా చెంతన వాహన ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఈ కుటుంబం చాలా రోజుల నుంచి కనిపించకపోయినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే
కాలువ చెంతన వెలికి తీసిన చెల్లెలు, బావ, మేనకోడలి మృతదేహాల్ని చూసి పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కంటతడి పెట్టారు. వారి మృతిపై ఎలాంటి అనుమానం లేదని అన్నారు. గత నెల 27వ తేదీ నుంచి కనపడకపోవడంతో ఏదైనా విహార యాత్రకు వెళ్లి ఉంటారని అనుకున్నామని తెలిపారు. ఇరుకైన వంతెన కావడంతో ఈ విషాదం జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు.

కుమారుడి మృతితో వ్యాకులతలో కుటుంబం
ఏడేళ్ల కిందట సత్యనారాయణరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి సిరిసిల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఈ కుటుంబం బాగా కుంగిపోయింది. తాజాగా ఈ ఇంట్లోని మిగతా ముగ్గురూ మృతిచెందిన తీరుని తలుచుకుని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విధి ఈ కుటుంబాన్ని ప్రమాదాల రూపంలో బలితీసుకుందని వాపోయారు.

ఏటా విహార యాత్రలకు వెళ్లే అలవాటు
సత్యనారాయణరెడ్డి కుటుంబానికి స్థానికులతో సత్సంబంధాలున్నాయి. అలాంటిది ఇంటిల్లిపాది చాలా రోజులుగా కనిపించకపోయినా ఆచూకీ కోసం ఎందుకు ప్రయత్నించలేదని విచారించగా పలు విషయాలు దృష్టికొచ్చాయి. ప్రభుత్వ టీచర్‌ అయిన రాధ ఇటీవల తరచూ సెలవులు పెడుతుండటంతో తోటి ఉద్యోగులు ఎప్పటిలాగే సెలవులో ఉన్నారనే కోణంలో ఆలోచించినట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లో ఉన్న ఫ్లాట్‌కు వెళ్తున్నామని సత్యనారాయణరెడ్డి చెప్పడంతో అనుమానం రాలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇక ఏటా ఓ సారి ఇంటిల్లిపాది విహార యాత్రలకు వెళ్లే ఆనవాయితి ఉండటంతో అదే విధంగా ఈ సారి కూడా ఎక్కడికో అందరూ కలిసి వెళ్లి ఉంటారనే భావనలో బంధువులున్నట్లు సమాచారం. 


రహదారి విశాలం.. వారధి ప్రమాదం
వంతెన పక్క నుంచి కాలువలోకి దూసుకెళ్తున్న వాహనాలు
రాజీవ్‌ రహదారిపై కాకతీయ కాలువ వద్ద తరచూ ప్రమాదాలు

 

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కరీంనగర్‌ సమీపంలోని రాజీవ్‌ రహదారిపై కాకతీయ కాలువ వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా ఇక్కడ తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు ఇందులో పడిపోయారు. గత నెల 25న కారు బోల్తాపడిన ప్రమాదంలో దంపతులిద్దరూ నీట మునిగి చనిపోయారు. తాజాగా సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, వారి కుమార్తె వినయశ్రీ(21) ఈ కాలువలో విగతజీవులై కనిపించారు. ఈ పరంపర ఇక్కడ ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలోనే రవాణాశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని ప్రమాద జోన్‌గా గుర్తించారు. అవటానికి ఈ మార్గం నాలుగు వరుసల రహదారే. అటూ ఇటూ కాకతీయ కాలువపై ఉన్న వంతెనలు మాత్రం రోడ్డు ఉన్నంత వెడల్పుగా లేవు. దాంతో వాహనాలు వంతెన పక్క నుంచి కాలువలోకి దూసుకుపోయే పరిస్థితులున్నాయి. ఇప్పటిదాకా చాలా ప్రమాదాలు అదే మాదిరి చోటుచేసుకున్నాయి. పైగా రాత్రి వేళల్లో కనీసం ఇక్కడ వీధిదీపాలు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. రేడియం స్టిక్కర్లతోపాటు వంతెనల సమీపంలో హెచ్చరికలతో కూడిన సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.