close

ప్రధానాంశాలు

సస్పెన్షన్‌ చట్టవిరుద్ధం

ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలి
ఆర్థిక ప్రయోజనాలూ కల్పించాలి
తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు
క్యాట్‌ తీర్పు కొట్టివేత

ఈనాడు, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చట్టవిరుద్ధం, ఏకపక్షమని కోర్టు తేల్చిచెప్పింది. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవో 18ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని, రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను అందజేయాలని స్పష్టం చేసింది. ఆయన మీద ఉన్న ఆరోపణలపై సర్వీసు నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన సస్పెన్షన్‌లో జోక్యం చేసుకోలేమంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) మార్చి 17న ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.లలితలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన జీవోను సమర్థిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదించారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం.. సస్పెండ్‌ చేయడానికి ముందే అభియోగాల్ని రూపొందించాల్సి ఉండగా, ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరించిందన్నారు. ఆరోపణలను కేంద్రానికి పంపి, వాళ్లు సంతృప్తి చెందితేనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య అని, రాత్రికి రాత్రే అదీ సెలవు రోజున సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆరోపణలపై వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటేశ్వరరావును బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని పేర్కొందన్నారు. గతేడాది మే 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 8 మధ్యకాలానికి జీతం చెల్లించలేదన్నారు. నిబంధనల ప్రకారం భద్రతా పరికరాలను టెండర్ల ద్వారా కొనాలని, సీనియర్‌ అధికారి పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతాయని, విభాగాధిపతిగా పిటిషనర్‌ నామమాత్రంగా ఆమోదిస్తూ సంతకం చేస్తారన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలు వచ్చిన అధికారిని సస్పెండ్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. తనవద్దకు వచ్చిన ఫైళ్లను పరిశీలించకుండా ఓ సీనియర్‌ అధికారి సంతకం చేయరాదన్నారు. ఆరోపణలపై ప్రాథమికంగా పరిశీలించి సంతృప్తి చెందాకే సస్పెండ్‌ చేశామని, ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ తీరును తప్పుబట్టింది. క్యాట్‌ తీర్పును రద్దు చేస్తూ, సస్పెన్షన్‌ జీవోను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.