close

తాజా వార్తలు

అయ్యో పంత్‌.. ఎలా వచ్చావో అలానే!

నిలవాలంటే ప్రత్యర్థులతో పాటు రాహుల్‌నూ ఎదుర్కోవాలి

‘‘పంత్‌కు అసాధారణమైన ప్రతిభ ఉంది. కాస్త కుదురుకునే సమయం ఇస్తే అతడో మ్యాచ్ విజేత అవుతాడు’’.. గత కొన్ని రోజులుగా భారత ఆటగాళ్లు, మాజీల నుంచి ఈ మాటలు తరుచూ విన్నాం. అయితే ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘‘రాహుల్‌తోనే కీపింగ్‌ చేయిస్తాం. అలా చేస్తే మరో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకోవచ్చు‌’’ అని కోహ్లీ, రవిశాస్త్రి చెబుతున్నారు. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే అసలైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న పంత్‌.. ఇప్పుడు తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతలా సమీకరణాలు మారిపోవడానికి పంత్‌ నిలకడలేమేనా? లేదా రాహుల్ సూపర్‌ ఫామ్‌ కారణమా? అని క్రికెట్‌ ప్రపంచం పెద్దఎత్తునా చర్చిస్తుంది.


ఎవరూ ఊహించనది
క్రికెట్‌ ప్రపంచంలో ఇప్పుడు అందరి చూపు కేఎల్ రాహుల్‌పైనే. ఏ స్థానంలో బరిలోకి దిగినా అతడు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నాడు. బ్యాటింగ్‌లో, వికెట్ల వెనుక సత్తా చాటుతూ అసలైన ‘3డీ ప్లేయర్‌’గా ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఓ వైపు జట్టులో రాహుల్‌ విలువైన ఆటగాడిగా మారిపోతుంటే.. మరోవైపు పంత్‌ తుదిజట్టులో స్థానం కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. టెస్టుల్లో ఇప్పటికే చోటు కోల్పోయిన అతడు‌ పరిమిత ఓవర్లలో నిలవాలంటే ప్రత్యర్థులతో పాటు రాహుల్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పంత్‌కు రాహుల్‌ ఇంతలా పోటీనిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే గతంలో పంత్‌ను తప్పించి సంజు శాంసన్‌, తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషాన్‌ వంటి వారికి అవకాశాలు ఇవ్వాలని చర్చలు సాగాయి. కానీ రాహుల్‌ గ్లవ్స్‌తో మెరుస్తుండటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.  


గాడిన పడుతున్న సమయంలో..
పంత్‌ ఎగసిపడిన కెరటంలా ఆదిలో మెరిపించి తర్వాత నిలకడలేమితో నిరాశపరిచాడు. కానీ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతడు మెరిశాడు. తొలి వన్డేలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ (71) ఆడాడు. ప్రతికూల పరిస్థితుల్లో శ్రేయస్‌తో కలిసి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా జట్టు అవసరాలను బట్టి దూకుడుగా ఇన్నింగ్స్‌ (16 బంతుల్లోనే 39) ఆడాడు. దీంతో పంత్‌ గాడిలో పడ్డాడని భావించారు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పంత్‌ కంకషన్‌కు గురయ్యాడు. ఇది అతడిని జట్టు నుంచి దూరం చేసింది. అతడి స్థానంలో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడం, వికెట్ల వెనుక, బ్యాటింగ్‌లో రాహుల్‌ సత్తా చాటుతుండటం చకచకా జరిగిపోయాయి. రాహుల్‌ కీపింగ్ చేయడంతో మనీష్‌ పాండే జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో భారత్‌ ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో మరింత పటిష్ఠంగా మారింది.


సాహా గాయంతో..  వచ్చాడు!
వృద్ధిమాన్‌ సాహా గాయంతో జట్టుకు దూరమవ్వడంతో పంత్‌ 2018లో ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. అదే సమయంలో శస్త్రచికిత్స కోసం సాహా కూడా ఇంగ్లాండ్‌కు వచ్చాడు. అయితే ఇంగ్లాండ్‌ పిచ్‌లపై పంత్‌ శతకం బాది అందరి దృష్టి ఆకర్షించాడు. సాహాకు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే టీమిండియా ప్రధాన వికెట్‌కీపర్‌గా పంత్‌ మారిపోయాడు. తర్వాత ఫర్వాలేదనిపిస్తూ పరుగులు సాధించాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ధోనీకి బ్యాకప్‌ కీపర్‌గా పంత్‌ ఎంపిక ఖాయమని భావించారు. కానీ అనుభజ్ఞుడైన దినేశ్‌ కార్తీక్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. కానీ ప్రపంచకప్‌లో ధావన్‌కు గాయమవ్వడం పంత్‌కు కలిసొచ్చింది. ఎట్టకేలకు మెగాటోర్నీలో చోటు సంపాదించాడు. ఆ తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించడంతో అన్ని ఫార్మాట్లలోనూ వికెట్‌కీపింగ్ భారాన్ని మోశాడు. కానీ కీలక సమయాల్లో కీపింగ్, బ్యాటింగ్‌లో తడబడ్డాడు. మైదానంలో పొరపాట్లతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా జట్టుయాజమాన్యం అతడికి అండగానే నిలిచింది. ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ ఆసీస్‌ పోరులో అతడు కంకషన్‌కు గురైన తర్వాత పరిస్థితి మారిపోయింది. సాహా గాయంతోనే ప్రధాన వికెట్‌కీపర్‌గా మారిన అతడు తన గాయంతోనే జట్టులో చోటు కోల్పోయాడు.


రాహుల్‌తో కీపింగ్ సరైనదేనా?
నిలకడగా రాణిస్తున్నాడు కదా అని రాహుల్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. టీ20ల్లో అయితే పనిభారం తక్కువ ఉంటుంది కాబట్టి ఫర్వాలేదు, కానీ వన్డేల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాక ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతున్న పంత్‌ను జట్టులోనుంచి తప్పించడం.. టీ20 ప్రపంచకప్‌ ముందు అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. రాహుల్‌తో కాకుండా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ పంత్‌తోనే కీపింగ్‌ చేయించాలని మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ కూడా పంత్‌కే మద్దతు ఇస్తున్నాడు. అయితే రాహుల్‌ వికెట్ల వెనుక ఉంటే అదనపు బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకోవచ్చని టీమిండియా ఆలోచన. దీని వల్ల బ్యాటింగ్‌ విభాగం మరింత పటిష్ఠంగా తయారవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అది సత్ఫలితాల్నిస్తుంది. కానీ ఎన్నో రోజులుగా టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధం చేస్తున్న పంత్‌ను తుదిజట్టు నుంచి తప్పించడం ఎంత వరకు సమంజసం? వన్డే ప్రపంచకప్‌లో ఎదుర్కొన్న ‘నాలుగో స్థానం సమస్య’ మాదిరిగానే పొట్టిఫార్మాట్‌లోనూ ‘వికెట్‌కీపర్ సమస్య’ భారత్‌కు ఎదురవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.