close

ప్రధానాంశాలు

కార్మికులను ప్రభుత్వమే గమ్యం చేర్చాలి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనంటూ శుక్రవారం హైకోర్టు స్పష్టం చేసింది. మేడ్చల్‌ జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న కార్మికులను గుర్తించాలని, వారందరికీ మేడ్చల్‌లోని కల్యాణ మండపాల్లో వసతి కల్పించాలని ఆదేశించింది. వారిని రాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టరాదంది. వారి సొంత రాష్ట్రాలకు క్షేమంగా వెళ్లడానికి వీలుగా.. సమీపంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో చేర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంది. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వపరంగా విఫలమెతే తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని హైకోర్టు హెచ్చరించింది. కార్మికుల పరిస్థితి, కోర్టు ఆదేశాల అమలుపై ఈనెల 29న సమాచారం ఇవ్వాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌కు ఆదేశించింది. వివిధ రాష్ట్రాల కార్మికులకు శ్రామిక్‌ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో వదిలేసి వస్తున్నారని ప్రొఫెసర్‌ రామ శంకరనారాయణ్‌ మేల్కొటె ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదిస్తూ కార్మికులు మేడ్చల్‌ జాతీయ రహదారిపై కాలినడకన వెళుతున్నారన్నారు. మార్గమధ్యంలో ప్రసవాలు జరుగుతున్నాయని, వారి బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చెప్పారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ సమాధానమిస్తూ రాష్ట్ర సరిహద్దు దాటాలనుకున్న కార్మికుల కోసం ప్రతి 10 కిలోమీటర్లకూ ఆహారం, నీరు అందుబాటులో ఉంచిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన 20 మంది కార్మికులు ప్రైవేటు బస్సును అద్దెకు తీసుకెళ్లారన్నారు. ఆ డ్రైవరు ఆదిలాబాద్‌ సరిహద్దుల్లో దింపివేయగా.. వారిని తాము బిలాస్‌పూర్‌కు క్షేమంగా చేర్చినట్లు చెప్పారు.
పండ్ల రైతుల బాధ్యత ప్రభుత్వాలదే
రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించకపోతే.. అది.. రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తుందని శుక్రవారం హైకోర్టు ఆందోళన చెందింది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనంది. పండ్ల రవాణాలో ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడాన్ని తప్పుబట్టింది. దీనిపై జూన్‌ 4లోగా నివేదికివ్వాలని ఆదేశించింది. పండ్ల రైతులు నష్టపోతున్నారంటూ మాజీ వెటర్నరీ డాక్టర్‌ కె.నారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం కోల్‌కతాలో వరదలు వచ్చినందున, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ మార్కెట్‌లకు పండ్లను ఎందుకు పంపకూడదంది. రైతుబంధు వంటివి అందించినా.. పంట చేతికొచ్చాక మార్కెట్‌ లేక దెబ్బతింటే డిసెంబరుకల్లా రైతులు ఆత్మహత్యలకు దారి తీసే పరిస్థితి ఎదురవుతుందని హైకోర్టు ఆవేదన చెందింది. పండ్లతో పాటు వరి, గోధుమలు తదితరాల రవాణాకు కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీహెచ్‌.నరేష్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఎస్‌.హెచ్‌.గణేశ్‌ కర్ణాటి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. దివ్యాంగుల కోసం రూ.కోటి కేటాయించామని, దివ్యాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి వద్ద రూ.10 వేలు అందుబాటులో ఉంచామని ఏజీ చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 40 వేల మంది న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, 7 లక్షల మంది దివ్యాంగులకు రూ.కోటి కేటాయించడం ఎంతవరకు సమంజసమంది. దివ్యాంగులకు ప్రతి నెలా ఆసరా పింఛను కింద రూ.3016 ఇస్తున్నామని, బియ్యం, కూరగాయలు, సరకులు సరఫరా చేస్తున్నామని ఏజీ చెప్పారు. దివ్యాంగుల కోసం సాయం కావాలని హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ వచ్చిన వెంటనే స్వచ్ఛంద సంస్థల సాయం కోసం ప్రయత్నించకుండా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి.. వారిని ఆదుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.