Punjab vs Bengaluru: పంజాబ్‌ ఔట్.. బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌ 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్‌ అయింది.    

Updated : 10 May 2024 00:01 IST

ధర్మశాల: ఐపీఎల్‌ 17 సీజన్‌లో బెంగళూరు వరుసగా నాలుగో విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో పంజాబ్ 17 ఓవర్లకు 181 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తాజా ఓటమితో పంజాబ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. 

పంజాబ్ బ్యాటర్లలో రిలీ రోసో (61; 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకం బాదాడు. శశాంక్ సింగ్ (37; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (27; 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సామ్‌ కరన్ (22; 16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా ఆడినా భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (6), జితేశ్‌ శర్మ (5), లివింగ్‌స్టోన్ (0) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3, స్వప్నిల్ సింగ్ 2, ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (92; 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆరంభంలో రెండుసార్లు జీవదానాలు అందుకున్న కోహ్లీ తర్వాత చెలరేగిపోయాడు. రజత్ పటిదార్‌ (55; 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. చివర్లో కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించి ఇన్నింగ్స్‌ చివరి బంతికి ఔటయ్యాడు. దినేశ్ కార్తిక్ (18; 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)  డుప్లెసిస్ (9), విల్ జాక్స్‌ (12) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో మూడే పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. విధ్వత్ కావేరప్ప 2, అర్ష్‌దీప్, సామ్ కరన్‌కు తలో వికెట్ దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని