Aavesham Review: రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘ఆవేశం’ మెప్పించిందా?

Updated : 09 May 2024 14:33 IST

Aavesham Review; చిత్రం: ఆవేశం; నటీనటులు: ఫహద్‌ ఫాజిల్‌, హిప్‌స్టర్‌, మిథున్‌ జై శంకర్‌, రోషన్‌ షానవాస్‌, షాజిన్‌ గోపు, మన్సూర్‌ అలీఖాన్‌ తదితరులు; సంగీతం: శుసిన్‌ శ్యామ్‌; ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌; సినిమాటోగ్రఫీ: సమీర్‌ తాహిర్‌; నిర్మాత: నజ్రియా నాజిమ్‌, అన్వర్‌ రషీద్‌; రచన, దర్శకత్వం: జీతూ మాధవన్‌; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఈ ఏడాది మలయాళ చిత్రాలు అక్కడి ప్రేక్షకులనే కాదు, ఇతర భాషల సినీ ప్రేమికులనూ అలరిస్తున్నాయి. వైవిధ్య నటుడిగా పేరున్న ఫహద్‌ ఫాజిల్‌ నటించిన తాజా సంచలనం ‘ఆవేశం’. మలయాళంలో రూ.150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రౌడీ షీటర్‌గా ఫహద్‌ నటన ఎలా ఉంది. (Aavesham movie review) తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా?

కథేంటంటే: అజు (హిప్‌స్టర్‌), బిబి (మిథున్ జై శంకర్‌), శంతన్‌ (రోషన్‌ షానవాజ్‌) ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వస్తారు. కాలేజ్‌ హాస్టల్‌లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండవచ్చని బీకే హాస్టల్‌లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లు అయిన కుట్టీ (మిధుట్టి), అతడి స్నేహితులు ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్‌ చేస్తారు. దీంతో ‘ఆవేశం’తో రగిలిపోయి, తమ సీనియర్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని స్థానికంగా ఉండే రౌడీలను కోసం వెతుకుతుంటే, గ్యాంగ్‌స్టర్‌ అయిన రంజిత్‌ గంగాధర్‌ అలియాస్‌ రంగా (ఫహద్‌ ఫాజిల్‌) తారసపడతాడు. రంగాది ఒక డిఫెరెంట్‌ క్యారెక్టర్‌. ప్రేమ, సంతోషం, కోపం ఏదైనా అతిగా ప్రదర్శిస్తాడు. ర్యాగింగ్‌ విషయం తెలిసి, ఆ సీనియర్స్‌కు బుద్ధి చెబుతాడు. అయితే, అప్పటి నుంచి అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హవా కొనసాగుతుంది. (Aavesham movie review) దీంతో చదువు పక్కకు వెళ్లిపోతుంది. అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ ఫెయిల్ అవడంతో, కాలేజ్‌ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. దీంతో ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లిపోయి చదువుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, రంగ వీళ్లను వదిలిపెట్టడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురూ తీసుకున్న నిర్ణయం ఏంటి? రంగా నుంచి ఎలా తప్పించుకున్నారు? తనని మోసం చేస్తున్నారని తెలిసిన రంగా వాళ్లను ఏం చేశాడు?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఆవేశం కథను సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే ‘మంచి వాళ్లతో విరోధం కన్నా, చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం’. తెలుగులోనూ పలువురు కథానాయకులు నెగెటివ్‌ షేడ్స్‌ కలిగిన పాత్రలు పోషించారు. కానీ, ‘ఆవేశం’లో రంగా పాత్రకు నెగెటివ్‌ షేడ్స్‌తో పాటు, కామెడీ, అతిగా స్పందించే తీరు ఆపాదించి తీర్చిదిద్దిన విధానం తెరపై మెరుపులు మెరిపించింది. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ముగ్గురు కుర్రాళ్లు తీసుకున్న నిర్ణయం వాళ్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందనే విషయంతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని రోలర్‌కోస్టర్‌ ఎక్కించేశాడు దర్శకుడు జితూ మాధవన్‌. ‘ఆవేశం’ కథా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్న దర్శకుడు.. గ్యాంగ్‌స్టర్‌ రంగాగా ఫహద్‌ ఫాజిల్‌ ఎంట్రీతోనే కథలో అసలు జోష్‌ మొదలవుతుంది. ఆ పాత్ర ఆహార్యం, ప్రవర్తించే తీరు, సంభాషణలు పలికే విధానం ఎంత ఎనర్జీగా ఉంటాయంటే, ఆయన కనిపించినంతసేపూ తెరపై టెన్‌ థౌంజెండ్‌ వాలా పేలుతూనే ఉంటుంది. (మన పూరి జగన్నాథ్‌ సినిమాల్లో హీరోలు కాస్త ఇలాగే ఉంటారు)

ముగ్గురు స్నేహితులు రంగా గ్యాంగ్‌తో పరిచయం పెంచుకోవడం, అక్కడి నుంచి రోజూ వారితో కలిసి తిరిగే సన్నివేశాలు రొటీన్‌గానే ఉన్నా, రంగా చేసే హంగామాతో అవన్నీ సరదాగా సాగిపోతాయి. అయితే, రంగా గ్యాంగ్‌స్టర్‌ ఎలా అయ్యాడన్న విషయాన్ని చెప్పే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. ఆ పాత్రకు ఇచ్చే నెరేషన్‌, ఎలివేషన్స్‌ అతిగా అనిపిస్తాయి. మధ్య మధ్యలో రంగా గ్యాంగ్‌, అతడి ప్రత్యర్థి గ్యాంగ్‌ పోటీ పడే సన్నివేశాలు, ఫైట్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ను మిక్స్‌ చేస్తూ తీసిన ఆ ఎపిసోడ్స్‌ అలరిస్తాయి. బిబి అతడి స్నేహితులు పరీక్షల్లో తప్పడంతో రంగాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఈ విషయాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారి రంగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఈ కుర్రాళ్లు అసలు రంగాకు తమ పరిస్థితి ఎలా వివరిస్తారా? అని ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తుంటాడు. ఆయా సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠతను పంచుతాయి. (Aavesham movie review) గబ్బర్‌సింగ్‌లో ‘అంత్యాక్షరి’లా రంగా తన గ్యాంగ్‌తో కలిసి డమ్‌షరాస్‌ ఆడే సన్నివేశం నవ్వులు పంచుతుంది. ఓ హైఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్‌, మదర్‌ సెంటిమెంట్‌తో సినిమా ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. చివరిలో ఈ ముగ్గురు కుర్రాళ్ల కోసం రంగా కాలేజ్‌కి వచ్చే సీన్‌ నవ్వులు పూయిస్తుంది.

ఎవరెలా చేశారంటే: గ్యాంగ్‌స్టర్‌ రంగా ఫహద్‌ ఫాజిల్‌ నటన మరో స్థాయిలో ఉంది. కాస్త ఆలస్యంగా ఆయన పాత్ర ఎంట్రీ ఇచ్చినా, అక్కడి నుంచి తెరపై మొత్తం ఫహద్‌ ఫాజిలే కనిపిస్తాడు. ఆయన నటన, హావభావాలు, డ్యాన్స్‌లు, ఫైట్స్‌ ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ అదరగొట్టాడు. ఒక సాధారణ కథను, తన నటనతో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా మార్చేశాడు. కాలేజ్‌ కుర్రాళ్లుగా హిప్‌స్టర్‌, మిథున్‌, రోషన్‌ చక్కని నటన ప్రదర్శించారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. (Aavesham movie review) రంగా గ్యాంగ్‌లో ఉండే, అంబన్‌, నంజప్ప, బ్రూస్లీ, జాకీ పాత్రలు పోషించిన వారు ఫైట్‌ సీన్స్‌లో అదరగొట్టారు. ‘రొమాంచమ్‌’లా ‘ఆవేశం’మూవీ కూడా సింపుల్‌ కథే అయినా, తన కథారచన, స్క్రీన్‌ప్లే, రంగా ఎలివేషన్స్‌తో తెరపై మెరుపులు మెరిపించాడు దర్శకుడు జీతూ మాధవన్‌.

కుటుంబంతో కలిసి చూడొచ్చు: చూడొచ్చు. ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేవు. కేవలం మలయాళ భాషలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌ ఉన్నాయి. తెలుగు భాషలోనూ అనువదించి ఉంటే మరింత ఆస్వాదించే అవకాశం ఉండేది.

  • బలాలు
  • + ఫహద్‌ ఫాజిల్‌ నటన
  • + స్క్రీన్‌ప్లే
  • + ద్వితీయార్ధం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు
  • - కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం
  • చివరిగా: ‘ఆవేశం’.. తెరపై ఫహద్‌ ఫాజిల్‌ మెరుపులు (Aavesham movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు