icon icon icon
icon icon icon

Pawan Singh: భాజపా టికెట్‌ వదులుకుని.. సొంత కూటమి అభ్యర్థిపై పోటీకి సై!

భాజపా కేటాయించిన టికెట్‌ను వదులుకున్న ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ తాజాగా బిహార్‌లోని కారాకాట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 10 May 2024 00:12 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్‌ సింగ్‌ (Pawan Singh) వ్యవహారం భాజపా (BNP)కు తలనొప్పిగా మారినట్లు కనబడుతోంది. తొలి విడత అభ్యర్థుల జాబితాలో కమలదళం ఆయనకు పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ స్థానాన్ని కేటాయించగా.. తాను పోటీ చేయలేనని వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సొంత రాష్ట్రమైన బిహార్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడం గమనార్హం. కారాకాట్‌ స్థానం నుంచి గురువారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ ఎన్డీయే అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుష్వాహా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

పవన్‌ సింగ్‌ వ్యవహారంపై స్పందించేందుకు సొంత పార్టీ వర్గాలు నిరాకరించినట్లు సమాచారం. అంతకుముందు టికెట్ కోసం ఆయన ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. పొరుగున ఉన్న ఆరా స్థానం నుంచి మూడోసారి బరిలో దిగిన కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఎన్డీయే అభ్యర్థిపై పోటీ చేయడం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కూటమికి నష్టం చేకూరుస్తుందని పేర్కొంటూ.. పార్టీ విధేయత ప్రాముఖ్యాన్ని చాటారు.

ముంగేర్‌ ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థికి లేటు వయసులో ‘ఎన్నికల’ పెళ్లి!

ఇదిలా ఉండగా.. పవన్‌ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడంతో కారాకాట్ స్థానంలో త్రిముఖ పోటీ జరగనుంది. ఎన్డీయే అభ్యర్థిగా కుష్వాహా త్వరలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. సీపీఐ(ఎం-ఎల్) లిబరేషన్‌కు చెందిన రాజారామ్ సింగ్ ఇప్పటికే ‘మహాఘఠ్‌బంధన్’ అభ్యర్థిగా తన నామపత్రాలను సమర్పించారు. జూన్ 1న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img