KL Rahul: కేఎల్‌ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?

హైదరాబాద్‌ చేతిలో ఓడిపోవడం లఖ్‌నవూ కెప్టెన్‌పై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. అంతకుముందు కోల్‌కతా చేతిలో ఘోర ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే.

Published : 09 May 2024 17:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు (KL Rahul) సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌ చేతిలో ఘోర ఓటమి తర్వాత లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా సారథి కేఎల్‌కు చీవాట్లు పెట్టినట్లు ఉన్న వీడియోలు కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు ఆడే చివరి రెండు మ్యాచులకు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తోంది. ‘‘లఖ్‌నవూ తన తదుపరి మ్యాచ్‌ను మే 14న ఆడనుంది. దాదాపు వారం రోజుల వ్యవధి. దిల్లీతో తలపడనుంది. తన బ్యాటింగ్‌పై ఏకాగ్రత కోసం కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే లఖ్‌నవూకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. అయితే మేనేజ్‌మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియదు’’ అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి. కేవలం రెండు మ్యాచ్‌లతో ఆగిపోడని.. ఫ్రాంచైజీకే గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి.

వచ్చే మెగా వేలానికి ముందు రిటైన్‌ కూడా కష్టమే!

ఐపీఎల్‌లోకి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అడుగుపెట్టినప్పటినుంచి కేఎల్‌ రాహుల్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2022, 2023 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈసారి కూడా ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టు తడబాటుకు గురవుతోంది. గత రెండు మ్యాచుల్లో భారీ ఓటమితో ఆ జట్టు కుదేలైంది. ఇక మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచినా.. ప్లేఆఫ్స్‌కు వెళ్తామనే గ్యారంటీ లేదు. దీంతో వచ్చే సీజన్‌ కోసం కొత్త సారథిని ఎంచుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2025లో జరగనున్న మెగా వేలానికి ముందు.. రిటైన్‌ చేసుకునే ప్రక్రియలో భాగంగా లఖ్‌నవూ అతడిని అట్టిపెట్టుకొనే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. రెండేళ్ల కిందట రూ. 17 కోట్లు వెచ్చించి కేఎల్‌ రాహుల్‌ను తీసుకుంది. ఇప్పుడు ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ఇలా కెమెరాల ముందే సీరియస్‌గా మాట్లాడటంతో కేఎల్‌ రాహులే స్వయంగా జట్టును వీడే ఛాన్స్‌ ఉందనేది కొందరి వాదన. అసలు వారేం మాట్లాడుకున్నారో బయటకు వస్తే కానీ.. ఈ అనుమానాలకు తెరపడదు.

బ్యాటర్‌గా తిరుగులేదు.. కానీ

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కేఎల్ రాహుల్ 12 మ్యాచుల్లో 460 పరుగులు చేశాడు. కానీ, స్ట్రైక్‌రేట్‌ తక్కువగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. పవర్‌ ప్లేలో దూకుడుగా ఉండాల్సిన సమయంలోనూ నెమ్మదిగా ఆడతాడనే కామెంట్లూ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 33 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక ఫోర్, ఒక సిక్స్‌ ఉన్నాయి. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినప్పుడు ఇలా ఆడటం ఓకే కానీ.. టీ20 ఫార్మాట్‌కు ఇది సరిపోదనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు పొట్టి ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఆ ప్రభావం కూడా కెప్టెన్సీపై పడి ఉంటుందని క్రీడా పండితులు చెబుతున్నమాట. అయితే, కేవలం ఒక్క మ్యాచ్‌తోనే కేఎల్ నాయకత్వంపై విమర్శలు చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. తదుపరి రెండు మ్యాచుల్లోనూ గెలిపించి ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్తాడని కేఎల్‌ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని