close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
80 శాతం మందిలో లక్షణాల్లేవు

కొత్తగా 3,307 కొవిడ్‌ కేసులు
ఇప్పటి వరకూ ఒక్కరోజులో ఇదే అత్యధికం
మరో 8 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 3,307 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కేసుల నిర్ధారణ ప్రారంభమైన తర్వాత ఒక్కరోజులో ఇంత భారీగా సంఖ్యలో ఎప్పుడూ కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని వైద్యనిపుణులు అంటున్నారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య రాష్ట్రంలో 3,38,045కు పెరిగింది. వీరిలో ఎటువంటి లక్షణాల్లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవారు 80.3 శాతం కాగా, లక్షణాలతో ఉన్న కొవిడ్‌ బాధితులు 19.7 శాతంగా నమోదయ్యారు. పాజిటివ్‌లలో పురుషులు 61.5 శాతం మంది, మహిళల్లో 38.5 శాతం మంది ఉన్నారు. మహమ్మారి బారినపడి మరో 8 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ 1,788 మంది కరోనాతో కన్నుమూశారు. మొత్తం పాజిటివ్‌లతో పోల్చితే మరణాల రేటు 0.52 శాతంగా నమోదైనా.. పాజిటివ్‌ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో..మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అందుకే పాజిటివ్‌ రేటును తగ్గించడం ద్వారా మరణాల రేటును కూడా తగ్గించడానికి మార్గం సులభమవుతుందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈనెల 14న (బుధవారం) రాత్రి 8 గంటలవరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. తాజాగా 897 మంది కొవిడ్‌కు చికిత్స పొంది కోలుకోగా, మొత్తంగా 3,08,396 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,861 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా, వీరిలో 18,685 మంది ఐసొలేషన్‌లో వైద్యసేవల్లో ఉన్నారు. బుధవారం 1,06,627 నమూనాలను పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,13,60,001కి పెరిగింది. మరో 3,715 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 446 కొత్త కేసులు నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 314, నిజామాబాద్‌లో 279, రంగారెడ్డిలో 277, జగిత్యాలలో 155, సంగారెడ్డిలో 153, నిర్మల్‌లో 148, కామారెడ్డిలో 128, నల్గొండలో 102, ఖమ్మంలో 101, కరీంనగర్‌లో 94, ఆదిలాబాద్‌లో 91, సిద్దిపేటలో 87, వరంగల్‌ నగర జిల్లాలో 86, మహబూబ్‌నగర్‌లో 78, మంచిర్యాలలో 75, రాజన్న సిరిసిల్లలో 75, మెదక్‌లో 67, సూర్యాపేటలో 66, పెద్దపల్లిలో 61, వికారాబాద్‌లో 60, వనపర్తిలో 54, యాదాద్రి భువనగిరిలో 52 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి.

మరో 1.35 లక్షల డోసుల పంపిణీ
రాష్ట్రంలో మరో 1,35,421 కొవిడ్‌ డోసులను బుధవారం వైద్య ఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. ఇందులో 1,25,383 తొలిడోసు కాగా, 10,038 మంది రెండోడోసు స్వీకరించిన వారున్నారు. ప్రభుత్వ వైద్యంలో 1,052 కేంద్రాల్లో.. ప్రైవేటులో 248 కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేశారు. దీంతో మొత్తంగా 21,35,994 మంది తొలి డోసును, 3,22,378 మంది రెండో డోసును పొందారు.

25,233 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్‌
తెలంగాణ ఆర్టీసీలో 45 సంవత్సరాలు దాటిన వారిలో 25,233 మందికి కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు వేసే కార్యక్రమం గురువారంతో ముగిసింది. వ్యాక్సిన్‌ వేయించే ప్రక్రియను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. 28,199 మందికి ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేయించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. 2,966 మంది ఆరోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో వారు వ్యాక్సిన్‌ వేయించుకోలేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు.

మళ్లీ మహమ్మారి భారిన తాండూరు ఎమ్మెల్యే
తాండూరు, న్యూస్‌టుడే: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయన గతేడాది కొవిడ్‌ బారినపడగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. గురువారం పరీక్షలు చేయించుకోగా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

యాదాద్రి భువనగిరి కలెక్టర్‌కు కరోనా
భువనగిరి గంజ్‌, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. ఆమెకు వైరస్‌ సోకిన లక్షణాలుండటంతో నిర్ధారణ నిమిత్తం బుధవారం నమూనా సేకరించి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు పంపారు. గురువారం పాజిటివ్‌ అని తేలినట్లు డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితిలో ఉందని, హోం ఐసొలేషన్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఉత్తమ్‌ పీఏ, డ్రైవర్‌, గన్‌మెన్లకు పాజిటివ్‌
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తన పీఏ, డ్రైవర్‌, ఇద్దరు గన్‌మెన్లకు కరోనా సోకినట్లు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వారిని ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా ఉత్తమ్‌కు మాత్రం వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు తెలిసింది.

అటవీశాఖలో కరోనాతో 11 మంది మృతి
అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

కొవిడ్‌ మహమ్మారి అటవీ ఉద్యోగుల్లో కలవరం కలిగిస్తోంది. అటవీశాఖలో ఇప్పటివరకు 11 మందిని బలిగొంది. 236 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నతాధికారులతో గురువారం అరణ్యభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న రెండు, మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభను మంత్రి ఆదేశించారు.  కొవిడ్‌ బారిన పడ్డ ఉద్యోగుల సాధకబాధకాలు తెలుసుకునేందుకు, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ఇద్దరు నోడల్‌ అధికారుల్ని నియమించాలని పీసీసీఎఫ్‌కు సూచించారు. అటవీ ఉద్యోగుల మరణంపై విచారం వ్యక్తంచేశారు.  ఈ సమావేశం అనంతరం పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు.
 

లింగంధన గ్రామ సర్పంచి మయూరి మృతి
కొవిడ్‌ టీకా వల్లేనని భర్త ఆరోపణ

కేశంపేట గ్రామీణం న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధన గ్రామ సర్పంచి రాజమోని మయూరి (32) గురువారం మృతిచెందారు. కొవిడ్‌ టీకా వల్లే తన భార్య మరణించినట్లు సర్పంచి భర్త మధుసూదన్‌గౌడ్‌ ఆరోపించారు. ఈ నెల 12న కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మయూరి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆ రోజు నుంచి ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత వైద్యశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి వైద్యం అందించలేదన్నారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికాగా వైద్యం కోసం శంషాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బాధితులు ధర్నా నిర్వహించారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచి మృతిపై జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి వినోద్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో దామోదర్‌ ఆరా తీశారు. మయూరి భర్త మధుసూదన్‌గౌడ్‌ను షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పరామర్శించి ఓదార్చారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు