close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైరస్‌ ఉద్ధృతితో దిల్లీ విలవిల

పరిస్థితి అత్యంత తీవ్రమని ప్రకటించిన కేజ్రీవాల్‌
సాయం చేయాలంటూ ప్రధానికి లేఖ

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో దేశ రాజధాని దిల్లీ విలవిలలాడుతోంది. 24 గంటల్లో 24 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రులన్నీ కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. రాజధానిలో పరిస్థితి ‘అత్యంత తీవ్రం’గా ఉన్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు. నగర ఆసుపత్రుల్లో 100 కంటే తక్కువ మాత్రమే ఐసీయూ పడకలు మిగిలినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 80 శాతం పడకలను వైరస్‌ సోకినవారికే కేటాయించాలని ఆదేశించారు. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత ఉందని.. దిల్లీకి కేటాయించిన కోటాను వేరే రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.

ప్రధానికి వినతి..

దిల్లీకి సాయం అందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్‌ లేఖ రాశారు. నగరంలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 వేల పడకలకు గాను కనీసం 7 వేలు కొవిడ్‌ బాధితులకు కేటాయించాలని, తక్షణం తగినంత ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కోరారు. రాజధానిలో పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కూడా వివరించినట్లు కేజ్రీవాల్‌ చెప్పారు. దిల్లీ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో 6,000 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వారాంతపు కర్ఫ్యూతో దిల్లీలోని వీధులు, సందర్శన స్థలాలు ఆదివారం నిర్మానుష్యంగా కనిపించాయి.

డీఆర్‌డీఓ సంస్థ కొవిడ్‌ ఆసుపత్రిని సోమవారం నుంచి పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. తొలుత 250 పడకలతో ప్రారంభించి క్రమంగా 500 పడకల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
ఐసొలేషన్‌ కోచ్‌లను సమకూర్చిన రైల్వే
పడకల కోసం వాడుకునేలా అత్యవసరంగా 5,000 రైల్వే కోచ్‌లను, పారా మెడికల్‌ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ దేవ్‌ రైల్వేబోర్డు ఛైర్మన్‌ సునీత్‌శర్మకు లేఖ రాశారు. 50 ఐసొలేషన్‌ కోచ్‌లను రైల్వే వెంటనే ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికుల ఆర్‌టీ-పీసీఆర్‌ రిపోర్టులను తనిఖీ చేయడంలో విఫలమైన 4 విమానయాన సంస్థలపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు దిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు