close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పార్టీ విచ్ఛిన్నానికి ఈటల కుట్ర

ఆయన హుజూరాబాద్‌లో బీసీ హైదరాబాద్‌లో ఓసీ
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్‌?
సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోం
మంత్రులు గంగుల, కొప్పుల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: తెరాసను విచ్ఛిన్నం చేసేందుకు, పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈటల రాజేందర్‌ కుట్ర చేశారని ఎస్సీ, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. బలహీన వర్గాల ముసుగులో ఒక మేకవన్నె పులి. ఆయన హుజూరాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని, మంత్రిపదవి పోగానే బీసీ బిడ్డనని చెప్పుకుంటున్నారని అన్నారు. ఆయన ఏనాడూ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం గురించి శాసనసభలో మాట్లాడలేదని అన్నారు. ఎంతోమంది బీసీలను అణగదొక్కారని, మంత్రి పదవికి సైతం ఏమాత్రం న్యాయం చేయలేదని గంగుల, కొప్పుల పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ వసతిగృహంలో చదువుకున్నానని చెప్పిన ఈటల.. ఇంత తక్కువ సమయంలో వేల ఎకరాల భూములు, రూ. వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో, మెడికల్‌ కాలేజీ ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. హుజూరాబాద్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ బొమ్మ మీదనే ఆరుసార్లు గెలిచినా ఏ మాత్రం కృతజ్ఞత లేదన్నారు. ప్రభుత్వంపై, తనను సోదరునిగా చూసుకున్న సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో వారు, ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

సీఎం ఎంతగానో ప్రోత్సహించారు:  కొప్పుల ఈశ్వర్‌
ఈటల రాజేందర్‌ను కేసీఆర్‌ ఎంతగానో ప్రోత్సహించారని, ఆయనకు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పార్టీ ద్వారా అనేక రకాలుగా ఈటల లబ్ధి పొందారని, ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిందని సీఎంను విమర్శించడం  ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని అన్నారు. ‘‘2001లో కేసీఆర్‌ పార్టీ పెడితే రెండేళ్ల తర్వాత 2003లో ఈటల పార్టీలో చేరారు. అప్పటికే ఉద్యమం ఉద్ధృతంగా ఉంది.. ఈటలకు కేసీఆర్‌ అన్ని రకాల పదవులు, అవకాశాలు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే చోటు కల్పించారు. అన్నీ అనుభవించి ఇప్పుడు విమర్శించడం బాధాకరం. ఎసైన్డ్‌ భూమిని కొనకూడదని ఈటలకు తెలియదా? వ్యాపార విస్తరణ కోసం 66 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని కొన్నట్లు ఆయనే చెప్పారు. ఆయనకు వ్యాపారమే ముఖ్యం.. బీసీలు, ఎస్సీల స్థితిగతులు పట్టవు.. ఎకరం కోటిన్నర పలికే భూమిని రూ. 6 లక్షలకే ఎలా కొన్నారు? దేవరయాంజల్‌ దగ్గర దేవాదాయ భూములు కొన్నట్లు అంగీకరించారు. గత నాలుగేళ్ల నుంచి ఈటల అసంతృప్తితో ఉన్నారు. ఎన్నిసార్లు దానిని వెళ్లగక్కినా పార్టీ ఆయన గౌరవానికి భంగం కలగనీయలేదు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన ఉద్దేశంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలతో టచ్‌లో ఉన్నారు: గంగుల కమలాకర్‌
ఈటల తనకు తాను ఎక్కువ ఊహించుకున్నారు. ఆయన మనసులో అంతా విషమే. పచ్చి అబద్ధాలకోరు. తన వ్యాపార అవసరాల కోసం రాజకీయాలను వాడుకున్నారు. దేవరయాంజల్‌ భూముల కోసం అంతమంది సీఎంలను కలిశారు కానీ ఏనాడూ బలహీనవర్గాల కోసం కలవనేలేదు. తన అసంతృప్తిని మంత్రులు, ఎమ్మెల్యేలపై రుద్దుతున్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములాగా కమలాపూర్‌ నియోజకవర్గంలో చేరి.. అక్కడి, నేతలను బయటకు పంపే ప్రయత్నం చేశారు. బీసీలు ఎదగకుండా అణగదొక్కారు. 2018లో సొంత పార్టీ బీసీ నేతల్ని ఓడగొట్టడానికి ప్రయత్నించిన నీచ వ్యక్తిత్వం ఆయనది. ఆయన వ్యాపార భాగస్వాములు కూడా బీసీలు కారు. ముదిరాజ్‌లపై ఏ మాత్రం ప్రేమలేదు. జమ్మికుంట-హుజూరాబాద్‌ పురపాలక ఛైర్మన్లు మంత్రి కేటీఆర్‌ను కలవాలంటే అడ్డుకున్నారు. పార్టీ గెలిస్తే ఏడ్చేవారు.. ఓడితే నవ్వేవారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు తాగే నీళ్లలో, కరెంటు వెలుగుల్లో సీఎం కేసీఆర్‌ను చూసుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో మేమంతా సంతోషంగా ఉన్నాం. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. బీసీలు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన ఏకైక సీఎం కేసీఆరే. ఈటల పోయినా హుజూరాబాద్‌లో పార్టీ బలంగా ఉంది. మేం ఎప్పటికీ కేసీఆర్‌ పేరుతోనే గెలుస్తాం’’ అని గంగుల పేర్కొన్నారు.
రాజకీయ భవిష్యత్తు కేసీఆర్‌ చలవే
‘‘తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్‌నే ఈటల సవాల్‌ చేస్తున్నారు. ఈటల పార్టీలో చేరకముందే కమలాపూర్‌లో అన్ని స్థానిక ఎన్నికల్లోనూ తెరాస గెలిచింది. 2003లో ఆ నియోజకవర్గాన్ని ఆయనకు బంగారుపళ్లెంలో పెట్టి ఇచ్చాం. ఎన్నికల్లో గెలిచాక శాసనసభాపక్ష నేత స్థానం కల్పించారు కేసీఆర్‌. హుజూరాబాద్‌కు ఏది కావాలంటే అది చేశారు. దేశం యావత్తు తెలంగాణ పథకాల వైపు చూస్తున్నపుడు వాటిని విమర్శించడం సబబా? ఈటల మీద ప్రేమతోనే సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో రైతుబంధును ప్రారంభించారు. అప్పుడు ఆ పథకాన్ని పొగిడి ఇపుడు విమర్శిస్తున్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల జోలికి పోవడం తప్పు’’ అని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు