Eetala భార్య పేరిట గోదాములకు అనుమతుల్లేవు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Eetala భార్య పేరిట గోదాములకు అనుమతుల్లేవు

ఆలయభూముల్లో 216 అక్రమ కట్టడాలు  
దేవరయాంజాల్‌ భూములపై మూడో రోజూ దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, శామీర్‌పేట: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య పేరిట ఉన్న గోదాములకు అనుమతులు లేవని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు బుధవారం గుర్తించారు. హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల్లో 219 గోదాములు ఉండగా.. వాటిల్లో కేవలం మూడింటికే హెచ్‌ఎండీఏ అనుమతి ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ భూములు తూంకుంట పురపాలిక పరిధిలో ఉండగా, గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఆలయ భూముల్లో భారీగా గోదాములు నిర్మించారని విచారణలో తేలింది. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ కుటుంబీకులు, అనుచరుల పేరిట వీటిని నిర్మించి వివిధ సంస్థలకు అద్దెకిచ్చి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పురపాలిక అధికారులను ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించారు. అనుమతి లేని గోదాములను కూల్చివేయకుండా పన్నులు ఎలా వసూలు చేస్తున్నారని అడిగారు. పన్నులు వేయడం ద్వారా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు అవుతుందన్నారు.

జమున పేరిట 6.20 ఎకరాల్లో గోదాములు
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య జమున పేరిట ఉన్న గోదాములను అధికారులు పరిశీలించారు. 6.20 ఎకరాల్లో ఇవి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఓ రిటైల్‌ వర్తక సంస్థ సరకులు నిల్వ ఉంచుతోంది. యజమానులు ఎవరు? అద్దె ఎంత చెల్లిస్తున్నారు? ఖాళీ స్థలం ఎంత ఉంది? గోదాములు ఎంత స్థలంలో నిర్మించారు? తదితర వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు నేతృత్వంలో ఐఏఎస్‌ అధికారులు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, భారతీ హోళికేరి, శ్వేతా మహంతి, విజిలెన్స్‌, ఏసీబీ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు వరుసగా మూడో రోజు సర్వే కొనసాగించాయి. క్షేత్ర స్థాయిలో డిజిటల్‌ సర్వే చేపట్టాయి. భూముల రేఖాచిత్ర పటాలతో పాటు గూగుల్‌ మ్యాపులు పరిశీలించాయి. ఆయా బృందాలకు 8 మంది తహసీల్దారు స్థాయి అధికారులు నేతృత్వం వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేసుకున్నాయి. ఈ పరిశీలన గురువారం సైతం కొనసాగనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదికసమర్పించనున్నట్లు తెలిసింది.
గత పంచాయతీ కార్యదర్శుల విచారణ
ఒకవైపు ఆలయ భూముల్లో నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు నమోదు చేసుకోగా.. మరోవైపు గతంలో దేవరయాంజాల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన వారిని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు విచారించారు. ఆలయ భూముల్లో అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అంటూ వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఆ భూముల్లో కొనసాగుతున్న సాయి గీత ఆశ్రమాన్ని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి పరిశీలించారు. ఆశ్రమం పక్కనే సాగు చేసుకుంటున్న రైతుల నుంచి వివరాలు సేకరించారు. అదే సమయంలో రఘునందన్‌రావు ఆకస్మికంగా విచ్చేసి సర్వేను పరిశీలించి సూచనలు చేశారు. ఆలయానికున్న 1521.13 ఎకరాల భూముల్లో కొంతభాగం ప్రైవేటు గోదాములుఉండగా, మిగిలిన ప్రాంతం ఖాళీగా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని