తరుగుతున్న కేసుల కొండ
close

ప్రధానాంశాలు

తరుగుతున్న కేసుల కొండ

తాజాగా 70,421 మందికి పాజిటివ్‌  
74 రోజుల్లో ఇదే అత్యల్పం

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి  తగ్గుముఖం పడుతుండటంతో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 70,421 కేసులు, 3,921 మరణాలు నమోదయ్యాయి. ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం 74 రోజుల తర్వాత ఇదే ప్రథమం. మూడు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్నిచోట్లా 10 వేల లోపు కేసులే నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాలు మినహా అన్నిచోట్లా 100 లోపు మరణాలు చోటుచేసుకున్నాయి. క్రియాశీలక కేసులు 66 రోజుల తర్వాత 10లక్షల లోపునకు తగ్గాయి. వాటి సంఖ్య 9,73,158కి తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.72%కి తగ్గింది.  మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఇదివరకు లెక్కలో చూపని మరణాలను ఆడిటింగ్‌ చేసి వెలికితీయడంతో ఆదివారం ఆ సంఖ్య 3,921కి చేరింది. ఇందులో 2,771 (70.67%) మహారాష్ట్ర నుంచే వచ్చాయి. అందులోనూ 2,288 పాత మరణాలని తేలింది. దీని ప్రకారం ఆ రాష్ట్రం నుంచి వచ్చిన దాంట్లో 483 మాత్రమే ప్రస్తుతం చోటుచేసుకున్న మరణాలని, మిగిలిన 82.56% పాతవేనని వెల్లడైంది. గత 4 రోజుల్లో మహారాష్ట్ర నుంచి 7,629, బిహార్‌ నుంచి 3,951 మరణాలు ఆడిట్‌లెక్కల కారణంగా కొవిడ్‌ మరణాల జాబితాలో కలిశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, గోవా, పంజాబ్‌ల్లో తేలిన ఇలాంటి లెక్కలన్నీ కలిపితే ఇదివరకు చూపని 20,741 మరణాలు ఇప్పుడు కొత్తగా చేరినట్లు తేలింది. మొత్తంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2.95 కోట్ల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. 3,74,305 మంది మరణించారు.  ఈ నెలలో గత రెండువారాల్లో రోజుకు 3,228.92 మంది చొప్పున 45,205 మంది కన్నుమూశారు. మే చివరి రెండువారాల్లో సంభవించిన 54,710 మరణాలతో పోలిస్తే ఇది 17.37% తక్కువ. ఇదే సమయంలో కేసులు 52.55% తగ్గినప్పటికీ మరణాల తరుగుదలలో మాత్రం ఆ సారూప్యత కనిపించలేదు. ఈనెల మొదటివారంలో నమోదైన కేసులతో పోలిస్తే మరణాలు 2.32%మేర సంభవించగా, రెండోవారంలో మరణాల రేటు 4.18%కి చేరింది. కేసులు తగ్గినప్పటికీ, ఇదివరకు దాచిపెట్టిన మరణాలను కొత్తగా లెక్కల్లో చేర్చడంతో తాజా మరణాల రేటు జాతీయ సగటు 1.27%కి దాదాపు 3 రెట్లు అధికంగా కనిపించింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని