సమావేశాన్ని వాయిదా వేయండి

ప్రధానాంశాలు

సమావేశాన్ని వాయిదా వేయండి

గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 9న నిర్ణయించిన సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. అదే రోజు సుప్రీంకోర్టులోనూ, ఎన్జీటీలోనూ కేసులున్నందున బోర్డు సమావేశానికి రాలేమని బోర్డు సభ్యకార్యదర్శికి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ గురువారం లేఖ రాశారు. బోర్డుల పరిధి, గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణపై చర్చించేందుకు గోదావరి బోర్డు అత్యవసర పూర్తిస్థాయి సమావేశాన్ని 9న ఏర్పాటు చేశారు. అదే రోజు కృష్ణాబోర్డు సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నామని, రెండు బోర్డుల సమావేశం సంయుక్తంగానే జరుగుతుందని కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆ రోజు హాజరుకావడం సాధ్యం కాదని, తమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎప్పుడు వీలవుతుందో మళ్లీ చెబుతామని ఈఎన్‌సీ తన లేఖలో పేర్కొన్నారు.

సీడబ్ల్యూసీ అధికారిపై అభ్యంతరం సరికాదు

రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించేందుకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న దేవేందర్‌రావు పట్ల ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారికి ప్రాంతాలను ఆపాదించడం దురదృష్టకరమని తెలంగాణ పేర్కొంది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శికి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాశారు. ఒక సభ్యుడు మాత్రమే నిర్ణయం తీసుకోలేరని, మొత్తం కమిటీ నిర్ణయం తీసుకొంటుందన్నారు. గతంలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి పంపుహౌస్‌ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర జలసంఘం కృష్ణా, గోదావరి బేసిన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.కె.శ్రీనివాస్‌ సభ్యుడిగా ఉన్నా, తాము అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించి తొమ్మిదో తేదీలోగా ఎన్జీటీకి నివేదిక ఇవ్వాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని