KCR: గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చేయూతనివ్వండి

ప్రధానాంశాలు

KCR: గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చేయూతనివ్వండి

ముఖ్యమంత్రుల భేటీలో కేసీఆర్‌
ఉప్పుడు బియ్యం కొనాలని గోయల్‌కు వినతి  
ఆ వెంటనే అమిత్‌ షా ఇంటికి వెళ్లి సమావేశం

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో నదీ పరీవాహకం, అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగిన ‘మావోయిస్టుల ప్రభావిత ప్రాంత రాష్ట్రాల సదస్సు’లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కూడా మూడు నాలుగు దశాబ్దాలు వామపక్ష తీవ్రవాదాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పేదరిక నిర్మూలన, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అటు అభివృద్ధి, ఇటు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతున్నామని తెలిపారు. యువతతోపాటు, అన్నివర్గాలకూ ప్రభుత్వం చేదోడుగా ఉంటోందని వెల్లడించారు. వ్యవసాయ, సాగునీటి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. మారుమూల ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, రహదారుల అనుసంధానం వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్‌ వరకు గోదావరి నది, అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న అన్ని పల్లెలకూ రహదారులు నిర్మించడంతోపాటు, వీలైనన్ని చోట్ల నదిపై వంతెనలు నిర్మించేందుకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన, అటవీప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఈ ప్రాంతాలకు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయాలని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

పీయూష్‌ గోయల్‌తో భేటీ

ఉప్పుడు బియ్యం సేకరణ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం రాత్రి కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీగా పేరుకుపోయిన ఉప్పుడు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వెసులుబాటు కల్పించాలని సీఎం ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. తెలంగాణలో ఏటా 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేంద్ర ప్రభుత్వం 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే తీసుకుంటానని చెప్పింది. రాష్ట్రం కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని కోరుతోంది. గత దిల్లీ పర్యటనలోనూ ముఖ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి ఇదే విజ్ఞప్తిచేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్‌, గంగుల కూడా కోరారు. కేంద్రం కొనకపోతే రాష్ట్రం ఇబ్బంది పడాల్సి వస్తుందని, అందువల్ల కేంద్రం సాయం చేయాలని తాజా సమావేశంలో ముఖ్యమంత్రి మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇంటికి వెళ్లి ఆయనతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఉప్పుడు బియ్యం సమస్యపై ఆయనకు కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని