విత్తులు.. ధరల కత్తులు

ప్రధానాంశాలు

విత్తులు.. ధరల కత్తులు

‘యాసంగి’ మొదలయ్యాక టెండర్లు

రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి పంటల విత్తనాల ధరలు మండిపోతున్నాయి. వరి సాగు చేయవద్దని, ఇతర పంటలే వేయాలని రైతులకు వ్యవసాయశాఖ చెబుతుండటంతో.. వాటి ధరలను ప్రైవేట్‌ వ్యాపారులు రోజురోజుకు పెంచేస్తున్నారు. ఈ నెల 1 నుంచి మొదలైన సీజన్‌ కోసం రైతులు విత్తనాల కొనుగోలు ప్రారంభించారు. వేరుసెనగ విత్తనాలను సోమవారం క్వింటా రూ.13 వేలకు విక్రయించగా.. మంగళవారం రూ.13,600కి పెంచేశారు. గతేడాది యాసంగిలో ఇవే విత్తనాలను రూ.6450కే విక్రయించారు. మరోవైపు ‘దాహం అవుతుంటే బావి తవ్వకం ప్రారంభించినట్టు’ యాసంగి సీజన్‌ మొదలయ్యాక విత్తనాల కోసం వ్యవసాయశాఖ వేట ప్రారంభించింది. విత్తనాలు లేకపోవడంతో వాటిని ఎప్పటిలోగా గ్రామాలకు పంపి, విక్రయాలు ప్రారంభిస్తుందో ప్రకటించలేదు. ఈలోగా ప్రైవేట్‌ కంపెనీలు ధరలు పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.

నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ కొలిక్కి!: యాసంగిలో వరి సాగు చేయవద్దని చెబుతున్న శాఖ.. 9 రకాల పంటల విత్తనాలు కొనుగోలు చేయాలని ‘తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ’ (టీఎస్‌ సీడ్స్‌)కు ఆదేశాలిచ్చింది. 5 లక్షలకు పైగా ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తున్న వేరుసెనగ విత్తనాలకు గత నెలలో టెండర్లు పిలవగా.. క్వింటాకు రూ.9400 ధరను ప్రైవేట్‌ కంపెనీలు కోట్‌ చేశాయి. ఇతర ఖర్చులూ కలిపితే రూ.10 వేలవుతుంది.ఈ టెండర్‌ను ఆమోదించాలా, వద్దా చెప్పాలంటూ వ్యవసాయశాఖకు టీఎస్‌ సీడ్స్‌ పంపింది. మరో 8 పంటల విత్తనాలకు టెండర్లు పిలుస్తూ టీఎస్‌ సీడ్స్‌ తాజాగా అత్యవసర నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 13లోగా టెండర్లు వేయాలని గడువు విధించింది. సెనగ విత్తనాలు 2 లక్షల క్వింటాళ్లు, ఆముదం, ఆవాలు రెండేసి వేలు, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వుల విత్తనాలు 5 వేల క్వింటాళ్ల చొప్పున అవసరమని పేర్కొంది. గడువు ముగిసిన వెంటనే దసరా సెలవులుండటంతో టెండర్లపై ఈ నెల 17 తరువాతే స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ప్రక్రియ ముగిసేసరికి ఈనెలాఖరు వరకూ సమయం పడుతుందని అంచనా.


రాయితీ ఇస్తారా?

ఈసారి డీజిల్‌, పెట్రోల్‌, కూలీల రేట్లు పెరగడంతో పాటు విత్తన పంటలను అధిక ధరలకు కొన్నందువల్ల తక్కువ ధరలకు అమ్మే పరిస్థితి లేదని ఓ ప్రధాన కంపెనీ ప్రతినిధి ‘ఈనాడు’కు తెలిపారు. పైగా యాసంగి సీజన్‌ ప్రారంభానికి నెలా, 2 నెలల ముందు టెండర్లు పిలిచి ఉంటే.. ఒకవేళ అధిక ధరలను కోట్‌ చేసినా కంపెనీలతో బేరమాడి తగ్గించడానికి అవకాశముండేది. సీజన్‌ ప్రారంభమయ్యాక ప్రభుత్వం హడావుడిగా కొనాలని నిర్ణయించడం కంపెనీలకు లాభదాయకంగా మారింది. అధిక ధరలు కోట్‌ చేస్తే ప్రభుత్వం కొంతమేర రాయితీని భరించాలన్న ప్రతిపాదనలున్నాయి. గతేడాది యాసంగి, గత వానాకాలం సీజన్‌లో ఏ పంట విత్తనాలకూ రాయితీ ఇవ్వనందువల్ల ఈ సీజన్‌లో ప్రభుత్వం ఇస్తుందా, లేదా అనేది వేచిచూడాలి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని