రైలు మార్గాలకు..రెడ్‌ సిగ్నల్‌

ప్రధానాంశాలు

రైలు మార్గాలకు..రెడ్‌ సిగ్నల్‌

పలు ప్రతిపాదిత ప్రాజెక్టులను అటకెక్కించిన రైల్వేబోర్డు

ఆదాయం రాదనే నివేదికలే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: ఒక రైలుమార్గం అనేక ప్రాంతాలను కలుపుతుంది. తద్వారా దీర్ఘకాలంలో ఆయా ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు, ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. సరకు రవాణాకూ ఇది దోహదం చేస్తుంది. అందుకే గతంలో ఆదాయంతో సంబంధం లేకుండా వెనుకబడిన ప్రాంతాలకు రైల్వేశాఖ కొత్త లైన్లను మంజూరుచేసేది. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తోంది. కొత్తవి దేవుడెరుగు..ఏళ్ల క్రితం సర్వేకు ఆమోదం తెలిపిన ప్రాజెక్టులనూ అటకెక్కిస్తోంది. తెలంగాణకు సంబంధించి మంచిర్యాల-ఆదిలాబాద్‌, మానకొండూరు-హుజూరాబాద్‌-ఎల్కతుర్తి సహా పలు ప్రతిపాదిత మార్గాల సర్వేలు పూర్తయి నివేదికలు రైల్వేబోర్డుకు చేరాయి. ఆదాయం తక్కువ వస్తుందనే నివేదికతో వాటిని రైల్వేబోర్డు పక్కనపెట్టేసింది.

రూ.3 వేల కోట్ల ప్రాజెక్టుకు మంగళం

మంచిర్యాల నుంచి ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్‌కు 2013-14లో కొత్తలైనును ప్రతిపాదించారు. 160.58 కి.మీ ఈ మార్గం నిర్మాణ అంచనా వ్యయం రూ.3,331.48 కోట్లు. 2020, డిసెంబరు 31న రైల్వేబోర్డుకు సర్వే నివేదిక అందింది. తిరిగివచ్చే ఆదాయం(రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌) మైనస్‌ 8.81శాతం ఉందంటూ ఈ ప్రతిపాదనను పక్కనపెట్టేయాలని రైల్వేబోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

* మానకొండూరు-హుజూరాబాద్‌-ఎల్కతుర్తి (హసన్‌పర్తి) మార్గం పొడవు 60 కి.మీ. 2021 జనవరిలో సర్వే నివేదికను అధికారులు సమర్పించారు. ఖర్చుకు తగిన ఆదాయం రాదనే కారణంతో ఈ ప్రాజెక్టునూ పక్కనబెడుతూ రైల్వేబోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది.

* ఆదిలాబాద్‌ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోకి వెళ్లి, తిరిగి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. దూరాన్ని తగ్గించే లక్ష్యంతో నిజామాబాద్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌ మధ్య 125 కి.మీ మేర కొత్త రైల్వేలైను కోసం సర్వే 2018లో మంజూరై పూర్తయింది. మూడేళ్లయినా ఇంకా అంచనాలే రూపొందించలేదు.

* పటాన్‌చెరు-సంగారెడ్డి-జోగిపేట-మెదక్‌ మార్గాన్ని సర్వే చేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. డిసెంబరులో రైల్వేబోర్డుకు సర్వే నివేదిక అందింది. ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదంటూ మే నెలాఖరులో పక్కనపెట్టేశారు.

* ఘన్‌పూర్‌-సూర్యాపేట వయా పాలకుర్తి మధ్య 91.7 కిమీ మార్గానికి సర్వే చేయాలని నిర్ణయించి ఆరేళ్లవుతోంది. అంచనా వ్యయం రూ.2,657.11 కోట్లు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

* మేడారం..దేశంలో అతిపెద్ద గిరిజన జాతర జరిగే ప్రాంతం. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ ప్రాంతానికి రైలుమార్గం లేదు. మణుగూరు నుంచి మంచిర్యాల వరకు మేడారం మీదుగా కొత్త రైల్వేలైను కోసం ఎంపీల నుంచి సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా..కనీసం సర్వే చేసేందుకు కూడా రైల్వేబోర్డు ఆమోదం తెలపడంలేదు. ద.మ.రైల్వే కూడా ప్రతిపాదన పంపట్లేదు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని