కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక

ప్రధానాంశాలు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక

డీఏ 3% పెంపు
31 శాతానికి చేరిన కరవు భత్యం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు తీపి కబురు. జులై నుంచి వర్తించేలా ప్రభుత్వం కరవు భత్యాన్ని (డీఏ) 3% మేర పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ఈ నిర్ణయం తీసుకొంది. ఉద్యోగులకు ప్రస్తుతం 28 శాతంగా ఉన్న డీఏకి అదనంగా ఈ పెంపు వర్తిస్తుందని సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. దీంతో మొత్తం కరవు భత్యం 31 శాతానికి చేరుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.9,488.74 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.  47.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కరోనా కారణంగా నిలిపివేసిన మూడు బకాయిలను ఈ ఏడాది జులైలో ఆమోదించి డీఏని 17 నుంచి 28%కి పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు.

‘పీఎం గతిశక్తి ప్రణాళిక’కు ఆమోదం
దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థలతో అనుసంధానించే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళిక అమలుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. రూ.100 లక్షల కోట్ల ఈ ప్రణాళికను ఈ నెల 13న ప్రధాని మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీని అమలు, పర్యవేక్షణకు బహుళ అంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో 18 శాఖల కార్యదర్శులు, లాజిస్టిక్‌ డివిజన్‌ అధిపతులతో కూడిన సాధికార బృందం ఏర్పాటవుతుంది. మల్టీమోడల్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేస్తారని, దీనికి అనుసంధానంగా టెక్నికల్‌ సపోర్ట్‌ యూనిట్‌ ఉంటుందని మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని