
తాజా వార్తలు
అన్నం పెట్టే చేతులను ఆదుకోవాలి కానీ..
రైతులపై పోలీసుల చర్యను ఖండించిన పంజాబ్ సీఎం
దిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళనను అడ్డుకునే క్రమంలో హరియాణా పోలీసులు వ్యవహరించిన తీరును పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే రైతుల హక్కులను ఈ విధంగా కాలరాయడం బాధాకరమన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
‘గత రెండు నెలలుగా పంజాబ్‌లో రైతులు ఎలాంటి సమస్యా లేకుండా శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు హరియాణా ప్రభుత్వం వారిని అడ్డుకుని రెచ్చగొడుతోంది? రైతులకు హైవేలపై వెళ్లే హక్కు కూడా లేదా? రాజ్యాంగదినోత్సవం రోజునే రైతుల హక్కులను అణచివేయడం బాధాకరమైన ఘటన. ఖట్టర్జీ వారిని వెనక్కి నెట్టకండి. రైతులను ముందుకు వెళ్లనివ్వండి. వారి గళాన్ని శాంతియుతంగా దిల్లీకి తీసుకెళ్లనివ్వండి’ అని అమరీందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే చేతులను పట్టుకోవాలే గానీ పక్కకు నెట్టేయొద్దని పంజాబ్ సీఎం కేంద్రాన్ని కోరారు.
బిహార్ ఎన్నికలకు లేని రూల్స్ రైతులకేనా?
కొవిడ్ నిబంధనల పేరుతో రైతుల ఆందోళనను అడ్డుకోవడంపై స్వరాజ్ ఇండియా అధినేత యోగేంద్ర యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా జైకిసాన్ ఆందోళన్ వాలంటీర్లతో కలిసి ‘చలో దిల్లీ’లో పాల్గొన్న యోగేంద్ర యాదవ్‌ను హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. జైపూర్-దిల్లీ హైవేపైకి వెళ్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో యోగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల హరియాణా ఉపముఖ్యమంత్రి రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. అప్పుడు మహమ్మారి లేదు. బిహార్ ఎన్నికల్లోనూ మహమ్మారి లేదు. కానీ రైతుల ఆందోళనకు మాత్రం కొవిడ్ పేరు చెబుతున్నారు’ అని మండిపడ్డారు.
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. దిల్లీ దిశగా కదం తొక్కిన రైతులను హరియాణా సరిహద్దుల్లో సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా-అంబాలా హైవే వద్ద నిలువరించాయి. దీంతో ఆగ్రహించిన రైతులు భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టిన బారికేడ్లను వంతెనపై నుంచి నదిలోకి పడేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. దీంతో హరియాణా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ రైతులు వెనకడుగు వేయలేదు. దాదాపు రెండు గంటల ఉద్రిక్తతల తర్వాత రైతులు హరియాణాలోకి ప్రవేశించారు. దేశ రాజధాని దిశగా కదిలారు.
మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ సరిహద్దులను మూసివేశారు. దిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
