ఒక్కరోజే 1.5 లక్షల కేసులు.. 839 మంది మృతి

తాజా వార్తలు

Updated : 11/04/2021 14:09 IST

ఒక్కరోజే 1.5 లక్షల కేసులు.. 839 మంది మృతి

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ రోజురోజుకు ఉద్ధృత రూపం దాలుస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్‌ కేసులతో పాటు.. మరణాలు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 14.12లక్షల పరీక్షలు చేయగా.. 1,52,879 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దేశంలో కరోనా వెలుగు చూసిన తర్వాత కేసులు ఇంత భారీ సంఖ్యలో వెలుగు చూడటం ఇదే మొదటిసారి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కి చేరింది. కొత్తగా 90,584మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,20,81,443కు చేరి.. రికవరీ రేటు 90.80శాతానికి తగ్గింది.

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 794 నమోదు కాగా.. శనివారం ఆ సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 839మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,69,275కి చేరింది. ఇక మరణాల రేటు 1.28 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 11,08,087 కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 35.19లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 10,15,95,147కి చేరింది.

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌?
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ పరిస్థితులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ విధించే అవకాశమున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఈ విషయమై శనివారం ముఖ్యమంత్రి వర్చువల్‌గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి అశోక్‌చవాన్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పరిధి, ఎన్నిరోజులు, ఎలా అనే విషయాలు త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే దాదాపు 58,993వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 301మరణాలు నమోదు 45,391 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 32.88లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 26.95లక్షల మంది కోలుకోగా.. 57,329 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5.36లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దిల్లీలోనూ కఠిన ఆంక్షలు
దిల్లీలోనూ పెరుగుతున్న కేసులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా దిల్లీ ప్రభుత్వం శనివారం పలు కఠిన ఆంక్షలు విధించింది. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు 50శాతం సీట్ల సామర్థ్యంలోనే నడుస్తాయి. వివాహ వేడుకల అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేసింది. రెస్టరెంట్లు, బార్లు సైతం 50శాతం సామర్థ్యంతో పనిచేయాలని అధికారులు స్పష్టం చేశారు. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సంస్కృతిక సంబంధ సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్ నివేదిక తప్పనిసరి చూపాల్సి ఉంటుంది.  దిల్లీలో గడిచిన 24 గంటల్లో 8,521 కేసులు నమోదయ్యాయి. 39 మంది కరోనాతో మరణించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని