‘బ్రిటన్‌ రకం’ జోరుకు కారణం ఇదే 

తాజా వార్తలు

Updated : 27/03/2021 15:52 IST

‘బ్రిటన్‌ రకం’ జోరుకు కారణం ఇదే 

వైరస్‌లో కీలక వివరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు 

లండన్‌: బ్రిటన్‌లో తొలిసారి కనిపించిన కరోనా వైరస్‌ రకానికి సంబంధించి కొత్త వివరాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ఉద్ధృతంగా వ్యాపించడానికి కారణాలను ఇవి వెలుగులో తెచ్చాయని వారు తెలిపారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. బి.1.1.7 అనే ఈ రకం కరోనా వైరస్‌ను గత ఏడాది డిసెంబర్‌లో కెంట్‌లో మొదటిసారి కనుగొన్నారు. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఐరోపా, బ్రిటన్‌లో రెండో విజృంభణకు ఇది కారణమైంది. ఇందులోని న్యూక్లియోక్యాప్సిడ్‌ జన్యువులో ఒక అదనపు ఉత్పరివర్తనను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వైరస్‌లోని సబ్‌జీనోమిక్‌ ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఫలితంగా మానవ రోగ నిరోధక వ్యవస్థను మరింత సమర్థంగా ఈ వైరస్‌ ఏమారుస్తోందని చెప్పారు. బాధితుడి శరీరంలో తన సంఖ్యను భారీగా పెంచుకోవడానికీ వైరస్‌కు ఇది వీలు కల్పిస్తోందని తెలిపారు. దీనివల్ల అతడిలో వైరల్‌ లోడు అధికంగా ఉండటంతో పాటు వ్యాధి వ్యాప్తి కూడా ఉద్ధృతంగా ఉంటోందని చెప్పారు. పూర్తిగా కొత్తదైన సబ్‌జీనోమిక్‌ ఆర్‌ఎన్‌ఏనూ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌లోని ఓఆర్‌ఎఫ్‌9బీ అనే ప్రొటీన్‌కు సంబంధించిన సూచనలు ఇందులో ఉన్నాయని తేల్చారు. మానవ రోగ నిరోధక వ్యవస్థను ఈ ప్రొటీన్‌ నియంత్రిస్తుంటుందన్నారు. బ్రిటన్‌ రకం వైరస్‌లో ఓఆర్‌ఎఫ్‌9బీ అధికంగా ఉందని చెప్పారు. ‘‘మన రోగ నిరోధక వ్యవస్థను బి.1.1.7 ఎక్కువగా నియంత్రిస్తోంది. అందువల్ల ఇతర రకాలతో పోలిస్తే అది ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది’’ అని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని