కరోనా టీకా: రక్తం గడ్డకట్టే ప్రమాదం లేదు

తాజా వార్తలు

Published : 23/03/2021 14:21 IST

కరోనా టీకా: రక్తం గడ్డకట్టే ప్రమాదం లేదు

దిల్లీ: కొవిషీల్డ్, కొవాగ్జిన్ కరోనా టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదమేమీ లేదని ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్యానెల్‌ వెల్లడించింది. టీకా తీసుకున్న అనంతరం రక్తం గడ్డకడుతోందన్న భయాలతో కొన్ని ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాంటి భయాలు ఏమీ అవసరం లేదంటూ ప్యానెల్ భరోసా ఇచ్చింది. ఇదిలా ఉండగా..ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ ఆస్ట్రాజెనెకా టీకా ‘సురక్షితమైంది, సమర్థమంతమైంది’ అని చెప్పడంతో..తిరిగి ఆ టీకాను వాడనున్నట్లు ఐరోపా దేశాలు తెలిపాయి.

ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, సీరం సంస్థ తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ టీకాలకు అత్యవసర వినియోగం కింద కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొవిషీల్డ్‌ను ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. జనవరి 16 నుంచి మొదలైన మొదటి దశ టీకా కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి ప్రాధాన్యం ఇచ్చారు. మార్చి ఒకటి నుంచి ప్రభుత్వం రెండో దశను ప్రారంభించింది. దీనికి కింద 60 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకా ఇస్తున్నారు. అలాగే 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి టీకా అందించే ప్రతిపాదనపై ప్రస్తుతం కేంద్రం యోచన చేస్తోంది.

కాగా, ఈ టీకా కార్యక్రమంలో భాగంగా తాము 400కు పైగా దుష్ప్రభావాలను విశ్లేషించామని నేషనల్ అడ్వర్స్‌ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్(ఏఈఎఫ్ఐ) తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న రెండు టీకాల వల్ల అసాధారణ రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి కేసులను గుర్తించలేదని పేర్కొంది. అలాగే కొద్ది రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కమిటీ కూడా ఆస్ట్రాజెనెకా టీకా గురించి సానుకూల వ్యాఖ్యలు చేసింది. కరోనా మరణాలు నివారించడంలో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించింది. ఇక, దేశవ్యాప్తంగా మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 32,53,095 మందికి టీకా అందించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని