ఓటమి భయంతోనే ఈవీఎంలపై అనుమానాలు!

తాజా వార్తలు

Published : 22/03/2021 01:55 IST

ఓటమి భయంతోనే ఈవీఎంలపై అనుమానాలు!

దీదీపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని ముందుగానే గ్రహించిన మమతా బెనర్జీ, ఈవీఎంల పనితీరును ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పదేళ్ల క్రితం మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకొచ్చినవి ఇవే ఈవీఎంలు అనే విషయాన్ని తృణమూల్‌ నేతలు గుర్తుపెట్టకోవాలన్నారు. రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వ అవినీతి ఆటలు ఇక సాగవని, అభివృద్ధి నినాదమే ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నియోజకవర్గంలో పర్యటించిన మోదీ, రానున్న రోజుల్లో బెంగాల్‌లో నిజమైన మార్పును చూస్తారన్నారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతాయేమోనని కనిపెట్టాలని తృణమూల్‌ కార్యకర్తలకు మమతా బెనర్జీ పదేపదే సూచిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఓటమిని ముందుగానే అంచనా వేసిన దీదీ, ఆ భయంతో ఇలాంటివి చేస్తున్నట్లు విమర్శించారు. ఇక తన తలపై మమతా బెనర్జీ తన్నేటట్లుగా ఉన్న వాల్‌పోస్టర్లు వెలవడంపైనా నరేంద్ర మోదీ స్పందించారు. ‘130కోట్ల మంది ప్రజల సేవలో నేను ఎప్పుడూ తలవంచుకునే ఉంటాను, దీదీ నా తలపై కాలు ఉంచినా పర్వాలేదు, కానీ, బెంగాల్‌ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించను’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పీఎం కిసాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాల్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని..అందుకే తృణమూల్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదన్నారు. స్కీమ్‌లపైనే భాజపా నడుస్తోందని, కానీ, తృణమూల్‌ మాత్రం ‘స్కామ్‌’లపై నడుస్తుందని దీదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. గడిచిన పదేళ్ల నుంచి బెంగాల్‌ ప్రజల జీవితాలతో మమతా బెనర్జీ ఆడుకుంటున్నారని, అలాంటి వాటికి ఈ ఎన్నికలతోనే ముగింపని ప్రధాని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని