Afghan: దేశం విడిచేందుకు సరిహద్దులకు భారీగా చేరుకుంటున్న అఫ్గాన్లు

తాజా వార్తలు

Published : 02/09/2021 01:15 IST

Afghan: దేశం విడిచేందుకు సరిహద్దులకు భారీగా చేరుకుంటున్న అఫ్గాన్లు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనేక మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. చాలా మంది రోజుల కొద్దీ కాబుల్‌ విమానాశ్రయం వద్దే పడిగాపులు కాశారు. అమెరికా బలగాల సాయంతోనైనా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భావించారు. కానీ అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించటంతో వారి ఆశలు అడియాశలుగా మారాయి. తాలిబన్ మూకల బారి నుంచి తప్పించుకొని ఎలాగైన దేశం దాటాలన్న సంకల్పంతో అఫ్గాన్ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం పాక్  సరిహద్దుకి వేలాదిగా అఫ్గాన్లు చేరుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పాక్‌తో పాటు మధ్య ఆసియా దేశాలైన తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్  సరిహద్దుల వద్దకు ప్రైవేటు వాహనాల్లో అఫ్గాన్లు తరలి వెళ్తున్నట్లు పేర్కొంది.

అయితే దేశాన్ని వీడేందుకు బయలుదేరుతున్న అఫ్గాన్లకు తాలిబన్ల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అన్ని దేశాల సరిహద్దులు సహా వాటికి దారితీసే చెక్ పోస్టుల వద్ద తాలిబన్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల వైపునకు వెళ్తున్న కార్లు, బస్సులు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అటు లక్షమంది అఫ్గాన్  శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు తజకిస్థాన్  అంగీకరించగా తమ దేశం నుంచి అమెరికాకు పయనమయ్యేందుకు అనుమతిస్తామని ఉజ్బెకిస్థాన్  ముందుకొచ్చింది.

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్లు బెంబేలెత్తుతున్నారు. గతంలో, ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. అనేక మందిని ఊచకోత కోస్తున్నారు. ఈ భయంతోనే అనేక మంది పౌరులు దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంకా చాలా మంది దేశాన్ని దాటి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. కట్టుబట్టలతో సరిహద్దులవైపు పరుగులు తీస్తున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని