మాస్కుల కోసం మార్షల్స్‌

ప్రధానాంశాలు

Updated : 20/02/2021 05:46 IST

మాస్కుల కోసం మార్షల్స్‌

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ముంబయి, దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇటీవల 75 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 5,427, కేరళలో 4,584 కొత్త కొవిడ్‌ కేసులు వచ్చాయి. కేరళలో విద్యాసంస్థలు ప్రారంభం, ముంబయిలో సబర్బన్‌ రైళ్లు పూర్తిస్థాయిలో తిరగడం వైరస్‌ వ్యాప్తికి కారణం కావొచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రజలు మాస్కులు ధరించడం లేదని గుర్తించిన అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముంబయిలో ప్రజలు మాస్కులు ధరించేలా చూసేందుకు మార్షల్స్‌ను నియమించారు. ముంబయిలో సుమారు 5వేల మంది మార్షల్స్‌ను దీని కోసం నియమించామని.. వారిలో చాలా మందిని రైల్వే స్టేషన్లలో ఉంచామని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఠాణె జిల్లాలోని డొంబివ్లీలో కరోనా మార్గదర్శకాలు ఉల్లంఘించి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న 500 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మూడు వారాల తర్వాత 13వేలకు పైగా కేసులు
దేశంలో మూడు వారాల అనంతరం (13వేలకు పైగా) కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో  13,193 మంది వైరస్‌ బారిన పడ్డారు. మరో 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,09,63,394కు చేరగా.. మృతుల సంఖ్య 1,56,111కి పెరిగింది. తాజాగా 10,896 మంది కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,06,67,741కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,39,542 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఆ రేటు 1.27 శాతంగా ఉంది.
కోటి దాటిన టీకాల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు కోటికి పైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కేవలం 34 రోజుల్లో కోటి మార్కును దాటినట్లు కేంద్రం పేర్కొంది. అమెరికాలో కేవలం 31రోజుల్లోనే కోటి వ్యాక్సిన్‌ డోసులను అందించగా.. బ్రిటన్‌ 56 రోజుల్లో ఈ ఘనతను అందుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన