సర్కారు జీతం.. ఉగ్ర సంస్థలకు ఊతం!

ప్రధానాంశాలు

Published : 11/07/2021 05:10 IST

సర్కారు జీతం.. ఉగ్ర సంస్థలకు ఊతం!

హిజ్బుల్‌ చీఫ్‌ సయ్యద్‌ కుమారులు సహా 11 మంది ఉద్యోగుల తొలగింపు
జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వ నిర్ణయం

శ్రీనగర్‌: ఉగ్రవాద సంస్థల తరఫున పనిచేస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం శనివారం విధుల నుంచి తొలగించింది. వీరిలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలాహుద్దీన్‌ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ 11 మందీ సాధారణ ఉద్యోగులు, ప్రజల్లా తిరుగుతూ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారు. వీరిలో అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందినవారు నలుగురు, బుద్గామ్‌ జిల్లాకు చెందిన ఉద్యోగులు ముగ్గురు, బారాముల్లా, శ్రీనగర్‌, పుల్వామా, కుప్వారాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. పోలీస్‌, వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి తదితర విభాగాలు, షేర్‌-ఎ-కశ్మీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌కేఐఎంఎస్‌)కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. పోలీసు శాఖకు చెందినవారు ఇద్దరు ఉండడం గమనార్హం. రాజ్యాంగంలోని 311వ అధికరణం కింద వీరందరినీ తొలగించారు. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించవచ్చు.

* సలాహుద్దీన్‌ కుమారులు సయ్యద్‌ అహ్మద్‌ షకీల్‌, షాహిద్‌ యూసుఫ్‌లు హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు హవాలా మార్గంలో నిధులు సమకూర్చుతున్న విషయాన్ని ఎన్‌ఐఏ గుర్తించింది. ఐటీఐ కుప్వారాకు చెందిన ఉద్యోగి ఒకరు భద్రత బలగాల కదలికల సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఉగ్రవాదులకు రహస్యంగా ఆశ్రయం సైతం కల్పించేవారు. ఉగ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేయడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఇద్దరు ఉపాధ్యాయులపై వచ్చాయి. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నాజ్‌ మహ్మద్‌.. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తరఫున పనిచేయడంతోపాటు ఓ ఉగ్రదాడిలో నేరుగా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు భయంకరమైన ఉగ్రవాదులకు అతను ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు. విద్యుత్తు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న షాహీన్‌ అహ్మద్‌ లోనె హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల కోసం ఆయుధాలను రహస్యంగా రవాణా చేసినట్లు వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన