సభను మార్కెట్‌లా మారుద్దామా?

ప్రధానాంశాలు

Published : 31/07/2021 04:41 IST

సభను మార్కెట్‌లా మారుద్దామా?

పార్లమెంటు ప్రతిష్ఠను కొందరు ఎంపీలు దిగజారుస్తున్నారు

తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు

చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని హెచ్చరిక

పెగాసస్‌పై ఉభయ సభల్లో కొనసాగిన విపక్షాల నిరసనలు

దిల్లీ: రాజ్యసభలో నిరసన చేపడుతున్న కొందరు ఎంపీల తీరుపై ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా వారి ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. ఈలలు వేస్తూ పెద్దల సభను మార్కెట్‌లా మారుద్దామా అని ఆవేదనతో ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే సభ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. మరోవైపు- పెగాసస్‌ నిఘా, ధరల పెరుగుదల, నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో శుక్రవారం కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

రాజ్యసభ కార్యకలాపాలు శుక్రవారం ప్రారంభమయ్యాక వెంకయ్యనాయుడు మాట్లాడారు. సభా మర్యాదను పాటించాల్సిందిగా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కొందరు ఎంపీలు ఈలలు వేస్తున్నారని.. మరికొందరు ఎంపీలేమో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ప్లకార్డులను వారికి అడ్డుగా పెడుతున్నారని పేర్కొన్నారు. కొందరు సభ్యులు మార్షల్స్‌ భుజాలపై చేతులు వేయడాన్నీ గమనించామన్నారు. ‘‘ఇవన్నీ సభ ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి. సభ్యులందరికీ నా విన్నపం ఒక్కటే. సభా మర్యాదను, హుందాతనాన్ని కాపాడండి. ఓపికకు ఓ హద్దు ఉంటుంది. నా ముందు రెండు ఐచ్ఛికాలున్నాయి. ఒకటి- ఎంపీల అనుచిత ప్రవర్తనను అనుమతించడం ద్వారా సభను మార్కెట్‌గా మార్చడం. రెండు- వారిపై చర్యలు తీసుకోవడం. సమస్యలపై నిరసన తెలపడం మంచిదే. కానీ సభా నియమాలు, ప్రతిష్ఠకు భంగం కలిగించకూడదు’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

రాజ్యసభలో నిరసనల హోరు

పెద్దల సభలో శుక్రవారం కూడా కాంగ్రెస్‌, తృణమూల్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. కొందరు సభ్యుల తీరుపై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శూన్యగంట అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమయ్యాక.. గందరగోళం కొనసాగింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం కొన్ని ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ప్రభుత్వం ‘లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ (సవరణ) బిల్లు-2021’, ‘డిపాజిట్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు-2021’లను ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కొబ్బరి అభివృద్ధి బోర్డు (సవరణ) బిల్లు-2021 పరిగణన కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో ఆ బిల్లును సభ ఆమోదించింది.

లోక్‌సభలో రెండు బిల్లులు..

రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ కూడా దద్దరిల్లింది. తొలుత సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక.. ప్రతిపక్షాల నిరసనల మధ్యే ‘జాతీయ రాజధాని ప్రాంతం, పొరుగు ప్రాంతాల్లో గాలి నాణ్యత నిర్వహణకు కమిషన్‌ బిల్లు-2021’, ‘జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (జాతీయీకరణ) సవరణ బిల్లు’లను ప్రవేశపెట్టారు.


పెగాసస్‌ అంశమే కాదు: ప్రహ్లాద్‌ జోషి

ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. లోక్‌సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న ‘పెగాసస్‌ కలకలం’ తీవ్ర అంశమేమీ కాదన్నారు. దానిపై చర్చ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. హ్యాకింగ్‌ విషయంపై ఐటీ వ్యవహారాల మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే సమగ్ర వివరణ ఇచ్చారని గుర్తుచేశారు. దిగువ సభలో ఈ వారం కొన్ని బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయని పేర్కొన్నారు. చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం పొందాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన