కాంగ్రెస్‌ ఖాతాను నిలిపివేసిన ట్విటర్‌

ప్రధానాంశాలు

Updated : 13/08/2021 05:56 IST

కాంగ్రెస్‌ ఖాతాను నిలిపివేసిన ట్విటర్‌

 పార్టీ శ్రేణులు 5 వేల మందివి కూడా

  కేంద్రం ఒత్తిడి చేసిందంటూ ఏఐసీసీ ధ్వజం

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ఖాతాను ట్విటర్‌ స్తంభింపజేయడం పెను దుమారం రేపింది. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు చెందిన దాదాపు 5,000 ఖాతాలను కూడా నిలిపివేయడంపై ఏఐసీసీ ధ్వజమెత్తింది. దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్‌ ఇటీవల స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అప్పుడు, ఇప్పుడూ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే సామాజిక మాధ్యమ సంస్థ ఆ విధంగా చేసిందని కాంగ్రెస్‌ పేర్కొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్‌ సూర్జేవాలా, కె.సి.వేణుగోపాల్‌, అజయ్‌ మకెన్‌, లోక్‌సభలో పార్టీ విప్‌ మాణికం ఠాగూర్‌, కేంద్ర మాజీ మంత్రి జితేంద్రసింగ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితా దేవ్‌ తదితరుల ఖాతాలనూ నిలిపివేశారని తెలిపింది. ప్రజల తరఫున వాణిని వినిపిస్తున్నందుకు తమపై అనూహ్య రీతిలో ఇలాంటి దాడి జరిగిందని పార్టీ.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. తమ నేతలు, కార్యకర్తలవి కలిపి మొత్తం 5,000 ఖాతాలను ట్విటర్‌ స్తంభింపజేసిందని కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగ అధిపతి రోహన్‌ గుప్తా తెలిపారు. ట్విటర్‌ను బెదిరించడం ద్వారా తమ గళాన్ని అణచి వేయాలని నరేంద్రమోదీ సర్కారు ప్రయత్నిస్తోందని రణదీప్‌ సూర్జేవాలా ఆరోపించారు.

నిష్పాక్షికంగానే వ్యవహరించాం: ట్విటర్‌

ఖాతాల స్తంభనపై ట్విటర్‌ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ- నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లను తొలగించకపోతే.. సంబంధిత ఖాతాను సంస్థ తాత్కాలికంగా నిలిపివేస్తుంది’’ అని వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన