కన్నీళ్లు పెట్టుకున్నా

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:50 IST

కన్నీళ్లు పెట్టుకున్నా

సెమీస్‌ ఓటమి బాధించింది

‘ఈనాడు’తో పి.వి.సింధు

ఈనాడు - హైదరాబాద్‌

భారత ఒలింపిక్స్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కడం గర్వంగా ఉందని తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు తెలిపింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అంది. సెమీఫైనల్లో ఓడిన తర్వాత కోచ్‌ పార్క్‌ మాటలు స్ఫూర్తి నింపాయని వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సింధుతో ఫోన్‌ ఇంటర్వ్యూ ‘ఈనాడు’కు ప్రత్యేకం.


వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించారు. భారత్‌ తరఫున సింధు అత్యుత్తమ ఒలింపిక్‌ క్రీడాకారిణి అని అనుకోవచ్చా?
నాకు మాటలు రావట్లేదు. రెండు పతకాల ఘనతను మాటల్లో వర్ణించలేను. మీ ప్రశంసకు కృతజ్ఞతలు. కచ్చితంగా గర్వించదగిన ఘనత ఇది. ఒలింపిక్స్‌లో దేశానికి ఒక పతకం అందిస్తే ఆ మధురానుభూతి జీవితాంతం నిలిచిపోతుంది. రెండు పతకాలు గెలవడం అన్నిటికంటే గొప్ప అనుకుంటున్నా. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో నాకంటూ ప్రత్యేక స్థానం దక్కడం గర్వంగా.. సంతోషంగా ఉంది.


రియోలో రజతం.. టోక్యోలో కాంస్యం గెలిచారు. 2024 పారిస్‌లో స్వర్ణం సాధిస్తారా?

పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం టోక్యో పతకం మధురానుభూతుల్ని ఆస్వాదిస్తున్నా. పారిస్‌లో కచ్చితంగా బరిలో దిగుతా. స్వర్ణం కోసమే ప్రయత్నిస్తా. నా ఆటతీరును మరింత  మెరుగుపరుచుకుంటా. అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తా.


కాంస్య పతక పోరులో ఆఖరి పాయింటు సాధించగానే ఏం  ఆలోచించారు?

చివరి పాయింట్‌ సాధించినప్పుడు అంతా శూన్యంగా అనిపించింది. ఏం చేస్తున్నానో తెలియలేదు. ఎలాంటి ఆలోచనలు రాలేదు. అయిదారు క్షణాల తర్వాత తేరుకున్నా. అవును.. నేను సాధించాను అనుకుని గట్టిగా అరిచా. కోచ్‌ పార్క్‌ను హత్తుకుని గెలుపు సంబరాలు మొదలుపెట్టా. కరోనా-లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ఎన్నో కష్టాలు పడ్డారు. వారందరితో పాటు నా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ పతకం అంకితం. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఎవరూ స్టేడియానికి రాలేకపోయారు. వారందరికీ దూరంగా ఉండటం బాధగా అనిపించింది. ప్రతి ఒక్కరు వారి ప్రేమాభిమానాలు చూపించారు. అందరికీ కృతజ్ఞతలు.


సెమీస్‌లో ఓడిన తర్వాత కాంస్య పోరుకు ఎలా సిద్ధమయ్యారు?

ఫైనల్‌ చేరుకోకపోవడం తీవ్రంగా బాధించింది. కన్నీళ్లు పెట్టుకున్నా. మంచి అవకాశం చేజారినందుకు చాలాసేపు బాధలో ఉన్నా. అప్పుడు కోచ్‌, ఫిజియో నాలో స్ఫూర్తి నింపారు. సెమీస్‌తోనే అంతా అయిపోయినట్లు కాదని.. తర్వాతి మ్యాచ్‌కు సిద్ధం కావాలని సూచించారు. కాంస్యానికి, నాలుగో స్థానానికి చాలా తేడా ఉంటుందని.. పతకం ఏదైనా పతకమే అని పార్క్‌ అన్నాడు. ఆ మాటలు నాకు ప్రేరణ ఇచ్చాయి. ఆదివారం ఉదయం నిద్ర లేచాక కాంస్య పతకంపైనే దృష్టిసారించా. పార్క్‌ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. మ్యాచ్‌కు ముందు.. మధ్యలో అవే మాటలు మదిలో మెదిలాయి.


రియో నుంచి టోక్యో వరకు సాగిన మీ ప్రయాణంపై ఏమంటారు?

అయిదేళ్లలో ఎత్తుపల్లాలు చూశా. రియో ఒలింపిక్స్‌ తర్వాత అన్నీ మారిపోయాయి. అనుభవం వచ్చింది. ఆటలో నైపుణ్యం పెరిగింది. కొత్త టెక్నిక్‌లు నేర్చుకున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచా. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయా. ఆట, టెక్నిక్‌ పరంగా చాలా మెరుగయ్యా. మధ్యలో కరోనా వచ్చింది. చాలా టోర్నీలు రద్దయ్యాయి. ఒలింపిక్స్‌కు ముందు సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా పోయింది. అయినా ఒక్క రోజు కూడా శిక్షణకు దూరం కాలేదు. లాక్‌డౌన్‌ సమయాన్ని కొత్త టెక్నిక్‌లు నేర్చుకోడానికి, ఫిట్‌నెస్‌ మెరుగు పరుచుకోడానికి ఉపయోగించుకున్నాం. ఒలింపిక్స్‌లో పెద్ద పెద్ద స్టేడియాలు ఉంటాయి. ఏసీ ఉంటుంది. అలాంటి వాతావరణానికి అలవాటు పడేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సాధన చేశాం. సుచిత్ర అకాడమీ నుంచి క్రీడాకారులు వచ్చారు. వారితో కలిసి సాధన చేశా. భారత బ్యాడ్మింటన్‌ సంఘం, సాయ్‌, తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ అడిగిన వెంటనే సహకారం అందించాయి. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదు.


రియో, టోక్యోల మధ్య తేడా ఉందా?

రియోకు టోక్యోకు అసలు పోలికే లేదు. అప్పుడు యువ క్రీడాకారిణిని. నాపై ఎలాంటి ఒత్తిడి.. అంచనాలు లేవు. 2021 పూర్తిగా భిన్నం. సీనియర్‌ క్రీడాకారిణిగా మారా. విపరీతమైన ఒత్తిడి. భారీ అంచనాలు. అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నా. పరిణతితో ఆడుతూ పని చేసుకుపోయా.


ఈ ఘనత పార్క్‌దే

‘‘ఏడాదిన్నరగా పార్క్‌ శిక్షణ ఇస్తున్నాడు. భవిష్యత్తులోనూ అతని ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తా. గోపీచంద్‌ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నా. ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నా. ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడింది. టోక్యోలో కాంస్యం గెలిచాక గోపీచంద్‌ సర్‌ ఫోన్‌ చేయలేదు. కంగ్రాట్స్‌ అంటూ సందేశం పంపించారు. థాంక్స్‌ చెప్పా. సైనా ఫోన్‌ చేయలేదు. మేం మాట్లాడుకోవడం చాలా తక్కువ. సోషల్‌ మీడియాను చూడలేపోయా. చాలా సందేశాలు ఉన్నాయి. ఈ పతకంలో గోపీచంద్‌ సర్‌ పాత్ర లేదు. ఏడాదిన్నరగా పార్క్‌ శిక్షణ ఇస్తున్నాడు. ఒలింపిక్స్‌ కోసం ఫిబ్రవరి నుంచి పార్క్‌, నేను కలిసి పనిచేస్తున్నాం. అక్కడ్నుంచి గోపీ సర్‌ భాగస్వామ్యం లేదు. పార్క్‌ పూర్తిగా నాకు మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఈ పతకం ఘనత అతడిదే’’

- విలేకరుల సమావేశంలో సింధు


ఆమె ఓదార్పుతో...

టోక్యో: ఫైనల్లో ఓడిన తనను సింధు ఊరడించిందని చైనా బ్యాడ్మింటన్‌ స్టార్‌ తై జు యింగ్‌ చెప్పింది. ‘‘ఫైనల్‌ తర్వాత నా ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. తర్వాత సింధు వచ్చి నన్ను హత్తుకుంది. ‘నువ్వు బాధలో ఉన్నావని తెలుసు. కానీ బాగా ఆడావు. కానీ ఈ రోజు నీది కాదు. ఓటమి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని చెప్పింది. ఆమె మనస్ఫూర్తిగా నన్ను పోత్సహించిన తీరుకు నేను ఏడ్చేశా. సింధుకు కృతజ్ఞతలు’’ అని తై జు చెప్పింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన